ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నేడు విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. భారత డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటర్ల లిస్ట్ లో అగ్రస్థానాన్ని కొనసాగిస్తుండగా..బౌలర్ల లిస్ట్ లో వరుణ్ చక్రవర్తి కూడా అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు, జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ఆల్‌రౌండర్ల జాబితాలో నెంబర్ వన్ గా నిలిచాడు. బ్యాటర్ల జాబితాలో అభిషేక్ శర్మ 909 పాయింట్లతో నెంబర్ వన్ గా నిలవగా.. ఇంగ్లండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్ (821), పాకిస్థాన్ ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ (769) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. భారత వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఏడు స్థానాలు మెరుగుపరుచుకుని 25వ ర్యాంకుకు చేరుకున్నాడు. బౌలర్ల విభాగంలో వరుణ్ చక్రవర్తికి, రెండో స్థానంలో ఉన్న పాకిస్థాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్‌కు మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉంది. శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగ ఒక స్థానం మెరుగుపరుచుకుని 5వ ర్యాంకుకు చేరాడు. భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మూడు స్థానాలు ఎగబాకి 11వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సికందర్ రజా, పాకిస్థాన్ ఆటగాడు సైమ్ అయూబ్‌ను వెనక్కి నెట్టి ఆల్‌రౌండర్ల జాబితాలో తిరిగి నంబర్ వన్ స్థానం లోకి దూసుకొచ్చాడు.