నేటి నుండి రంజీ ట్రోఫీ ఫైనల్ జరగనుంది. మొట్ట మొదటి సారి ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ఫైనల్ చేరిన జమ్మూ కాశ్మీర్ ఎనిమిదిసార్లు ఛాంపియన్ కర్ణాటకతో తలపడనుంది. స్టార్ ప్లేయర్లతో నిండిన కర్ణాటకను జమ్ముకశ్మీర్ ఎలా ఎదుర్కొంటుదనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. బౌలింగ్లో ఈ సీజన్లో 55 వికెట్లు పడగొట్టిన పేసర్ అకిబ్ నబి ఆ టీమ్ కు ప్రధాన బలం. బ్యాటింగ్ లో అబ్దుల్ సమద్ (655 పరుగులు), కెప్టెన్ పరాస్ డోగ్రా (551) కూడా ఆ టీమ్ కు కీలక ఆటగాళ్లు. మరోవైపు కర్ణాటక అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ ఇలా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఈ సీజన్లోనే అత్యధిక పరుగులు చేసిన రవిచంద్రన్ స్మరణ్ (950)తో పాటు కరుణ్ నాయర్ (699), కెప్టెన్ దేవ్లాత్ పడిక్కల్ (532), మయాంక్ అగర్వాల్ (518) లతో దుర్భేద్యంగా కనిపిస్తోంది. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఫైనల్లోనూ రాణించాలని ఆ టీమ్ అభిమానులు కోరుకుంటున్నారు. బౌలింగ్ తో పాటు, బ్యాట్ తో అదరగొడుతున్న శ్రేయస్ గోపాల్ (46 వికెట్లు, 442 పరుగులు) కర్ణాటక టీమ్ లో ప్రముఖ పాత్ర పోషించే అవకాశముంది. జమ్ముకశ్మీర్ తో పోలిస్తే కర్ణాటకనే ఫైనల్లో బలంగా కనిపిస్తున్నప్పటికీ సమిష్టిగా రాణిస్తే జమ్మూ కాశ్మీర్ కూడా సంచలనం సృష్టించే అవకాశం ఉంది.