జైపూర్‌కు గుడ్‌బై చెప్పిన రాజస్థాన్ రాయల్స్…ఆర్ఆర్ కెప్టెన్ గా జడేజా..! 

Spread the love

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ (RR) అభిమానులకు ఒక ఊహించని వార్త వెలువడింది.ఐపీఎల్ ఆరంభం (2008) నుండి తమకు కటౌట్ కోటగా ఉన్న జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంకు రాయల్స్ యాజమాన్యం తాత్కాలికంగా స్వస్తి చెప్పనుంది.రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (RCA)లో కొనసాగుతున్న పరిపాలనా సంక్షోభం, భద్రతా ప్రమాణాల పాటించకపోవడం , గత సీజన్‌లో ఫ్రాంచైజీపై వచ్చిన నిందారోపణల నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.రాజస్థాన్ రాయల్స్ తన ప్రధాన హోమ్ గ్రౌండ్‌గా పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (MCA) స్టేడియంను ఎంచుకోగా,అస్సాంలోని గువాహటి స్టేడియం రెండో హోమ్ వేదికగా కొనసాగనుంది.ఇప్పటికే ఫ్రాంచైజీ ప్రతినిధులు పుణె స్టేడియాన్ని సందర్శించి వసతులపై సంతృప్తి వ్యక్తం చేయడంతో, బీసీసీఐ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరోవైపు, జట్టు కెప్టెన్సీ విషయంలోనూ భారీ మార్పు చోటుచేసుకుంది.స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌కు ట్రేడ్ చేసిన రాజస్థాన్, ప్రతిగా టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను జట్టులోకి తెచ్చుకుంది.తాజాగా రాజస్థాన్ రాయల్స్ తన సోషల్ మీడియా ఖాతాలో జడేజా ఫోటోను షేర్ చేస్తూ ‘దళపతి’ (Thalapathy) అనే ట్యాగ్‌ను జోడించడంతో, 2026 సీజన్‌లో జట్టు పగ్గాలు ఆయనకే దక్కుతాయనేది దాదాపు ఖరారైంది.2008లో షేన్ వార్న్ సారథ్యంలో మొదటి ట్రోఫీని గెలిచినప్పుడు జట్టులో ఉన్న జడేజా, మళ్ళీ ఇన్నేళ్లకు ‘హోమ్ కమింగ్’ అవుతూ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుండటం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ వంటి యువ ఆటగాళ్లను జడేజా తన అనుభవంతో ఎలా నడిపిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.