భారత్ 2036 ఒలింపిక్స్ స్పోర్ట్స్ నిర్వహణ దిశగా పూర్తి స్థాయిలో సిద్ధమవుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వారణాసిలో 72వ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్ షిప్ పోటీల ప్రారంభోత్సవంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. జనవరి 4 నుంచి 11 వరకు జరగనున్న జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్ దేశవ్యాప్తంగా 58 జట్లు పాల్గొంటున్నాయి.
గత పదేళ్ల కాలంలో భారత్ 20కి పైగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కు వేదికగా నిలిచింది. అండర్- 17 ఫిఫా ప్రపంచకప్, హాకీ ప్రపంచకప్, అనేక ప్రపంచ స్థాయి చెస్ టోర్నీలను విజయవంతంగా నిర్వహించింది. 2030లో జరిగే కామన్వెల్త్ క్రీడలకు కూడా భారత్ ఆతిథ్యమివ్వబోతోంది. క్రీడాకారులకు మరింత గొప్ప అవకాశం కల్పించే దిశగా 2036 ఒలింపిక్స్ కు ఆతిథ్యమిచ్చేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పోర్ట్స్ బడ్జెట్ ను కూడా ఎంతో పెంచిందని టాలెంట్ ను వెతికిపట్టుకుని , ట్రైనింగ్, పౌష్టికాహారం, పారదర్శక ఎంపికకు ప్రాధాన్యమిస్తూ క్రీడాకారుల ప్రయోజనాలే లక్ష్యంగా క్రీడా విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తోందని ప్రధాని అన్నారు. 2014 తర్వాత క్రీడల్లో భారత్ ప్రదర్శన నిలకడగా మెరుగుపడుతున్నట్లు తెలిపారు. మన క్రీడాకారుల ఆత్మవిశ్వాసం కూడా ఎంతో పెరిగిందని ఆయన పేర్కొన్నారు.