మరో రికార్డుకు అతి చేరువలో కింగ్ కోహ్లీ

Spread the love

వర్తమాన అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులతో దూసుకుపోతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు అతి సమీపంలో ఉన్నాడు. భారత క్రికెట్ అభిమానులు ఈ ఫీట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  అంతర్జాతీయ క్రికెట్‌లో 28 వేల పరుగుల మైలురాయిని చేరుకోవడానికి రన్ మెషీన్ కోహ్లీ 25 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. ఈ ఘనతను త్వరలో న్యూజిలాండ్‌తో  జరగనున్న  మూడు వన్డేల సిరీస్‌ లో సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీ20, టెస్ట్ ఫార్మాట్లకు ఇప్పటికే వీడ్కోలు పలికిన కోహ్లీ ప్రస్తుతం వన్డే క్రికెట్‌ మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. జనవరి 11న న్యూజిలాండ్‌తో జరిగే తొలి వన్డే మ్యాచ్‌ లోవిరాట్  మళ్లీ గ్రౌండ్ లోకి  దిగనున్నాడు. ఈ మ్యాచ్‌ లోనే  ఆ చారిత్రాత్మక మైలురాయిని అందుకుంటాడని భావిస్తున్నారు. 

ప్రస్తుతం కోహ్లీ 623 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ల్లో 27,975 పరుగులు సాధించాడు. మరో 25 పరుగులు చేస్తే, 28,000 పరుగుల క్లబ్‌లోకి అడుగుపెట్టే మూడోబ్యాటర్ గా నిలుస్తాడు. ఈ జాబితాలో ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర మాత్రమే ఉన్నారు. అంతేకాదు, సచిన్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధిస్తే, కోహ్లీ మరో అరుదైన రికార్డును సాధించినట్లే. వన్డేల్లో పరుగుల వర్షం కురిపించిన కోహ్లీ, 53 సెంచరీలు, 76 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో 34,357, కుమార సంగక్కర 28,016 పరుగులతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.