మంత్రిని హెచ్చరిస్తున్న సొంత పార్టీ నేతలు..!

Spread the love

Adilabad Minister Vivek: రాష్ట్ర మంత్రి అంటే రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లిరావచ్చు. కానీ ఓ మంత్రి మాత్రం తన సొంత పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో మాత్రం కాలు పెట్టలేకపోతున్నారు. కాదు.. కాదు.. కాలు పెట్టనివ్వడం లేదు. మంత్రి తమ నియోజకవర్గంలోకి రావొద్దంటూ సొంత పార్టీ నేతలే హెచ్చరించడంతో మంత్రి అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇంతకీ ఏంటా నియోజకవర్గం. ఎవ్వరా మంత్రి ?

కొత్తగా రాష్ట్రమంత్రివర్గంలోకి వచ్చిన వివేక్ సొంత పార్టీలో, పైగా సొంత జిల్లాలోనే తలనొప్పులు తప్పడం లేదు. ఆయన ఎన్నికల వరకు వేరే పార్టీలో ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆయన వచ్చీ రావడంతో తనకు, తన అన్న వినోద్కు టిక్కెట్ సాధించుకున్నారు. అంతేకాదు తన కొడుకు వంశీకి సైతం పెద్దపల్లి ఎంపీ టిక్కెట్టు సంపాదించిపెట్టారు. ఇదంతా ఒక్కెత్తు అయితే మరో బంపర్ ఆఫర్ కొట్టేశారు. కొద్ది రోజుల కిందట జరిగిన మంత్రి వర్గ విస్తరణలో మంత్రి కూడా అయ్యారు. అయితే ఇన్ని రోజులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి పదవిపై ఆశపెట్టుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. తాను ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకునిని ఉంటున్నాననీ ప్రేం సాగర్ రావు చెబుతున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ హయాంలో తనపై ఎన్నో కేసులు కూడా నమోదైనా, వాటన్నింటిని ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేశానని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్లో నిర్వహించిన భట్టి పాదయాత్ర, ఖర్గే బహిరంగ సభను సైతం లక్షం మందితో విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించిన తనకు మంత్రి పదవి రాకపోవడంపై మండిపడుతున్నారు. Adilabad Minister Vivek.

కాంగ్రెస్ అధిష్టానం ఏం ఆలోచించిదో ఏమో కానీ… ప్రేంసాగర్ రావును కాదని వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి కట్టబెట్టింది. దీంతో అటు ప్రేంసాగర్ రావు, ఆయన అనుచరవర్గం ఇప్పుడు వివేక్ అంటే మండి పడుతున్నారు. తాము కష్టపడి పార్టీని కాపాడుకుంటూ వస్తే వివేక్ ని మంత్రి చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పది రోజుల కిందట ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను నిలదీశారు. కష్టపడ్డది తామైతే ఫలితం దక్కింది మరొకరి అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. వేరే పదవి ఇవ్వాలని చూసిన అధిష్టానం ఆఫర్ ను ఆయన తిరస్కరించారట.

తనకు మంత్రి పదవి తప్ప వేరే ఏం వద్దంటూ అక్కడి నుంచి వచ్చేశారట. కాంగ్రెస్ తమ నేతకు అన్యాయం చేసిందని ఆగ్రహంతో ఉన్న ప్రేంసాగర్ రావు అనుచరులు తమ నేతకు దక్కాల్సిన మంత్రి పదవి గద్దలా తన్నుకుపోయిన గడ్డం వివేక్ మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. ఎంపీ ఎన్నికల సమయంలో తన కుమారుడు వంశీకృష్ణను గెలిపిస్తే ప్రేంసాగర్ రావు మంత్రి పదవికి తాను అడ్డురానని చెప్పిన వివేక్, ఇప్పుడు మంత్రి కావడాన్ని ప్రేం సాగర్ రావు జీర్ణించుకోలేకపోతున్నారట. అంతేకాదు, తమ నియోజకవర్గంలో అడ్డుపెట్టొద్దని ఏకంగా మంత్రి వివేక్ వెంకటస్వామికి అల్టిమేటం జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ మంత్రి మంచిర్యాల వస్తే గొడవలు తప్పవంటూ వార్నింగులు కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదంతా గమనించిన వివేక్ ఎందుకైనా మంచిదని నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారట. మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సైతం ఇందారం మీదుగా చెన్నూరు నుంచి మందమర్రి వెళ్లిన మంత్రి మంచిర్యాలలో మాత్రం అడుగుపెట్టలేదు. ప్రేంసాగర్ రావు, ఆయన అనుచరుల హెచ్చరికలతో మంచిర్యాల నియోజకవర్గం రావడం లేదు. మంత్రి వివేక్ రాకున్నా తన నియోజకవర్గ అభివృద్ధి ఆగకుండా చూసుకుంటున్న ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు, ఆయన అనుచరులు మంత్రిని మాత్రం నియోజకవర్గంలో అడుగుపెట్టనిచ్చేది లేదంటూ భీష్మించినట్లు తెలుస్తోంది.

తాజాగా మంచిర్యాల జిల్లాకు నలుగురు మంత్రులు వచ్చిన సభకు మంత్రి వివేక్ ఆహ్వానం లేదు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, జిల్లా ఇన్ చార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు పర్యటించారు. మంచిర్యాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సైతం మంత్రి వివేక్ స్థానికంగా ఉన్న హాజరుకాలేదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి మంత్రిగా వివేక్ ఎప్పుడైనా మంచిర్యాల నియోజకవర్గంలో అడుగుపెడతారా..? ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటారా..? వేచి చూడాల్సిందే.

Also Read: https://mega9tv.com/telangana/massive-gold-robbery-in-sri-sai-santoshi-jewellery-at-suryapet/