ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్ లో హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ అదరగొట్టింది. మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ గోల్డ్ మెడల్ సాధించింది. టీమ్ విభాగంలో కూడా గోల్డ్ అందుకుంది. వ్యక్తిగత విభాగం ఫైనల్ లో ఇషా 239.8 తో టాప్ లో నిలిచింది. షూటింగ్లో స్వర్ణ పతకాన్ని సాధించిన తెలంగాణ బిడ్డ ఇషా సింగ్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. దేశానికి ఎనలేని గర్వకారణంగా నిలుస్తూ, తన సొంత గడ్డకు కీర్తి ప్రతిష్టలు తెచ్చినందుకు ఆమెను కొనియాడారు.ఆమె పట్టుదల, ఏకాగ్రత మరియు పోరాట పటిమ మన యువత శక్తిని, అలాగే తెలంగాణలో నిలకడగా ఎదుగుతున్న క్రీడా సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ స్వర్ణ విజయం ఎంతోమంది యువతులకు పెద్ద కలలు కనడానికి మరియు ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి స్ఫూర్తినిస్తుందన్నారు. తెలంగాణ నీ పట్ల గర్విస్తోంది. నీ భవిష్యత్తు ప్రయాణంలో రాష్ట్ర ప్రభుత్వం నీకు అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ లో పోస్ట్ చేసింది.