ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. తెలంగాణలోని ములుగు జిల్లా, తాడ్వాయి మండలంలోని మేడారం అడవుల్లో ఈ మహా జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి అత్యంత వైభవంగా జరుగుతుంది. కాగా, గత నెల 28 నుంచి 31 వరకు జరిగిన ఈ మేడారం జాతర హుండీల లెక్కింపు ప్రారంభమైంది. హుండీల లెక్కింపునకు పది రోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.. రెండేళ్లకోసారి వచ్చే ఈ మహా జాతరలో సమ్మక్క, సారలమ్మలను కోట్లాది మంది భక్తులు దర్శించుకుంటారు. జాతరకు నెల రోజుల ముందు, జాతర అనంతరం మరికొన్నిరోజులు మేడారంను భక్తులు సందర్శిస్తారు. ఇక ఈ మహా జాతర హుండీలను హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపానికి తీసుకువచ్చారు. ఈరోజు మంత్రి కొండా సురేఖ కొబ్బరికాయ కొట్టి లెక్కింపును ప్రారంభించారు. భక్తులు సమర్పించిన కానుకలను ప్రత్యేక ఏర్పాట్లతో, పూర్తి భద్రతా చర్యలు మరియు పారదర్శకతతో లెక్కించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మేడారం జాతరకు తరలి వచ్చిన భక్తులు అమ్మవార్లకు కానుకలు సమర్పించుకున్నారు. గత మేడారం జాతరకు రూ.13 కోట్ల ఆదాయం సమకూరింది.