కాంగ్రెస్ పార్టీ VB-G RAM G పథకంపై తప్పుడు ప్రచారం చేస్తోంది:కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 

Spread the love

కాంగ్రెస్ పార్టీ VB-G RAM G పథకంపై తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉపాధి హామీ పథకం బడ్జెట్ నిధులు తగ్గించామని, పథకాన్ని నీరుగారుస్తున్నామని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆక్షేపించారు.  పథకాన్ని నీరుగార్చడం కాదు, మరింత బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఉన్న దళారి వ్యవస్థను నిర్మూలించి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం.VB-G RAM G ఫథకం వల్ల రాష్ట్రాలపై అదనపు భారం పడుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ  అది నిజం కాదు. రాష్ట్రాలు మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా అదనపు భారం మోస్తోందని కిషన్ రెడ్డి వివరించారు. ఈ సంవత్సరం గత ఏడాదితో పోలిస్తే దేశవ్యాప్తంగా రూ.17 వేల కోట్లు అదనంగా ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయబోతోందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా గత ఏడాదితో పోలిస్తే సుమారు రూ.340 కోట్లు అదనంగా కేంద్ర ప్రభుత్వం నిధులు అందించబోతోంది.రైతులు, కూలీలు, గ్రామీణ ప్రజలు డిమాండ్ చేస్తున్న అంశాలను ప్రాతిపదికగా తీసుకునే ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసి  VB-G RAM G ఫథకం తీసుకువచ్చినట్లు చెప్పారు.  గతంలో వ్యవసాయం పనులు ఎక్కువగా  ఉండే సమయంలో కూలీలు దొరక్క రైతులు నష్టపోయేవారని అయితే ప్రస్తుతం వ్యవసాయ పనుల సమయంలో రైతులకు కూలీలు అందుబాటులో ఉండేలా పథకంలో మార్పులు చేసినట్లు తెలిపారు.  అలాగే పని అడిగిన ప్రతి కూలీకి తప్పనిసరిగా పని కల్పించేలా, ఒకవేళ పని కల్పించలేకపోతే, వారికి పరిహారం చెల్లించాల్సిందే అనే నిబంధనను చట్టంలో పొందుపరిచామన్నారు.