తెలంగాణాలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఎలక్షన్ కమీషన్ ఫైనల్ ఓటర్ లిస్ట్ ను ప్రకటించింది. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 52,43,023 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపింది. వీరిలో 25,62,369 మంది పురుష ఓటర్లు కాగా.. 26,80,014 మంది మహిళా ఓటర్లు, 640 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్లో అత్యధికంగా 3,48,051 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే కొత్తగూడెం కార్పొరేషన్లో అత్యల్పంగా 1,34,775 మంది ఓటర్లు ఉన్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అత్యధికంగా 1,43,655 మంది ఓటర్లు అమరచింత మున్సిపాలిటీలో అత్యల్పంగా 9,147 మంది ఓటర్లు ఉన్నారు. రిజర్వేషన్లు ఖరారైన తర్వాత నోటిఫికేషన్ విడుదల కానుంది. జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు.