ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు భారీ ఉపశమనం

Spread the love

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీ.ఆర్.ఎస్. సీనియర్ నేత, మాజీ మంత్రి,హరీష్ రావుకు సుప్రీం కోర్టులో  భారీ ఊరట లభించింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ (SLP)ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా  వాదనలు వినిపించారు. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ కొనసాగుతోందని, దీనికి సంబంధించి కీలక ఆధారాలు ఉన్నందున హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు, ప్రభుత్వం సమర్పించిన వాదనలతో విభేదించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావుకు ఎటువంటి సంబంధం లేదని గతంలోనే హైకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో, ఇకపై ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.  ఈ తీర్పుతో హరీశ్ రావు ఈ కేసు నుంచి ఊరట లభించినట్లయింది.  బీఆర్‌ఎస్ నేతలు దీన్ని పెద్ద విజయంగా చూస్తున్నారు.