మావోయిస్టు పార్టీ అగ్రనేత మాద్వి హిడ్మా మరణంపై ఆ పార్టీ సంచలన ఆరోపణలు చేస్తూ బహిరంగ లేఖ విడుదల చేసింది. భద్రాద్రి కొత్తగూడెం – అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరుతో వచ్చిన ఈ లేఖలో.. హిడ్మా మృతి సహజమైంది కాదని, అదొక పక్కా ప్రణాళికాబద్ధమైన కుట్ర అని పేర్కొన్నారు. అనారోగ్యంతో ఉన్న హిడ్మా, రాజితో పాటు ఇతర సభ్యులకు వైద్యం చేయిస్తానని నమ్మించిన ఒక కాంట్రాక్టర్, వారిని శత్రువుల (పోలీసుల) చేతికి చిక్కేలా చేసి ద్రోహానికి పాల్పడ్డాడని మావోయిస్టులు ఆరోపించారు. ఈ కుట్రలో చర్ల ప్రాంతానికి చెందిన ఒక ముఖ్య కాంగ్రెస్ నాయకుడి హస్తం ఉందని, గతంలో తాము క్షమించి వదిలేసినా ఆయన బుద్ధి మార్చుకోకుండా మావోయిస్టులను ఆంధ్ర ప్రాంతానికి తరలించి పట్టిచ్చారని లేఖలో వివరించారు.ఈ ద్రోహానికి సంబంధించి తమ వద్ద బలమైన వాయిస్ రికార్డులు ఉన్నాయని, పార్టీని మోసం చేసిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.ఇప్పటికే ఒక కాంట్రాక్టర్‌ను అంతమొందించామని గుర్తు చేస్తూ, మిగిలిన వారిపై కూడా తమ నిఘా ఉందని హెచ్చరించడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది.