హైదరాబాద్ కి తలమానికంగా దేశంలో ఉన్న ఏకైక ఉర్దూ యూనివర్సిటీని కాంగ్రెస్ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని బీ.ఆర్.ఎస్.వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ ఆరోపించారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విశిష్టమైన యూనివర్సిటీని రియల్ ఎస్టేట్ అవసరాల కోసం కాంగ్రెస్ వాడాలనుకుంటుందన్నారు. 50 ఎకరాల యూనివర్సిటీ భూమిని అక్రమంగా తీసుకోవాలని చూస్తుందని రాష్ట్ర ప్రభుత్వం సీరియల్ కిల్లర్ల మాదిరి సీరియల్ ల్యాండ్ స్నాచర్ గా మారిందని ఆరోపించారు. ముందుగా అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమిని హైకోర్టు పేరిట చెప్పి తీసుకున్నదని 400ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని గుంజుకునే ప్రయత్నం చేసిందని సెంట్రల్ యూనివర్సిటీ భూమి అయిన కేంద్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు. అయితే విద్యార్థుల ఆందోళన.. ప్రజల వ్యతిరేకత.. సుప్రీమ్ కోర్ట్ జోక్యం వలన తాత్కాలికంగా ఆగిందన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి వ్యవహారంలో పదివేల కోట్ల భూమి కుంభకోణం జరిగింది అని సుప్రీంకోర్టు చెప్పినా.. ఇప్పటిదాకా కేంద్రం ఎలాంటి విచారణ చేపట్టలేదన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో సెంట్రల్ యూనివర్సిటీ ఉర్దూ యూనివర్సిటీ భూములపైన కన్ను వేసేది కాదన్నారు. ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులకు బీ.ఆర్.ఎస్ తరఫున అండగా ఉంటామన్నారు. రాబోయే మా ప్రభుత్వంలో యూనివర్సిటీ విస్తరణ కోసం అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తామని భరోసానిచ్చారు. అవసరమైతే ఉర్దూ యూనివర్సిటీ భూములను కాపాడుకోవడం కోసం ఢిల్లీలో పోరాటం చేయాల్సి వస్తే అండగా ఉంటామన్నారు. ఈ అంశాన్ని అవసరమైతే రాజ్యసభలో మా పార్టీ పార్లమెంట్ సభ్యులు లేవనెత్తుతారని పేర్కొన్నారు.