ప్రజలు సంక్రాంతికి తమ తమ సొంతూళ్లకు వెళ్లనున్న నేపథ్యంలో 6,431 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలంగాణరాష్ట్ర రోడ్డురవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) తెలిపింది. ముఖ్యంగా ఈ నెల 9, 10, 12, 13తేదీల్లో నాలుగురోజుల పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేశామని,అదేవిధంగా తిరుగుప్రయాణంలో 18 తేదీల్లో రద్దీకి తగిన ఏర్పాట్లు చేశామని ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైన ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎంజీబీఎస్, జేబీఎస్, ఆరాంఘర్, ఎల్బీనగర్. క్రాస్ రోడ్స్, కే.పీ.హెచ్.బీ, బోయినపల్లి, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి బస్సులు బయల్దేరనున్నాయి. జీవో నంబరు 16 ప్రకారం టికెట్ల ధరలు అదనంగా 50 శాతం వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఈ సంక్రాంతి పండగకు నడిపే ప్రత్యేక బస్సుల్లోనూ అదనపు ఛార్జీలు ఉంటాయి. 9, 10, 12, 13 తేదీలతో పాటు 18, 19 తేదీల్లో మాత్రమే పెంచిన ఛార్జీలు అమలవనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు,ఎక్స్ ప్రెస్, సిటీ. ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుంది. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రీ రిజర్వేషన్ www.tgartcbus in వెబ్ సైట్లో చేసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. స్పెషల్ బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033కు సంప్రదించాలని సూచించింది.