తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ చేరుకుంది. అక్కడ వారికి తెలంగాణ ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. సీఎంతో పాటు మంత్రి మరియు ఉన్నతాధికారులు ఈ టీమ్ లో ఉన్నారు. ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే దావోస్ చేరుకున్నారు. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశం 2026లో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ చేరుకున్న ఈ బృందానికి జ్యూరిచ్ విమానాశ్రయంలో ప్రవాస భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు. అలాగే స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారి మృదుల్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డికి సాదరంగా ఆహ్వానం పలికారు. మొదటి రోజే పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానుంది. TelanganaRising2047 రోడ్‌మ్యాప్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో, వివిధ రంగాలకు చెందిన ప్రముఖ ప్రపంచ స్థాయి కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు మరియు ప్రతినిధులతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. గతేడాది డిసెంబర్ లో విడుదల చేసిన ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్’ నేపథ్యంలో, ఈ Davos26 పర్యటనలో రాష్ట్ర దీర్ఘకాలిక వృద్ధి దృక్పథం, అభ్యుదయ విధానాలు మరియు పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని ప్రపంచ నాయకులకు, సీఈఓలకు మరియు పరిశ్రమల ప్రతినిధులకు వివరించడంపై ప్రతినిధి బృందం ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.