టెలీమెట్రిల ఏర్పాటు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై  మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ 

Spread the love

కృష్ణా జలాల వినియోగ లెక్కలు తేల్చేందుకు గాను టెలిమెట్రిల కోసం కేటాయించిన రూ. 4.18 కోట్ల నిధులను KRMB దారి మళ్లిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూడటం సిగ్గుచేటని బీ.ఆర్.ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఉద్దేశపూర్వకంగానే టెలిమెట్రిల ఏర్పాటు ప్రక్రియను ఆలస్యం చేస్తూ, కృష్ణా జలాల ఏపీ అక్రమ వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం దుర్మార్గమని అన్నారు. జూన్ 2016లో జరిగిన KRMB సమావేశ నిర్ణయం ప్రకారం మొదటి దశలో 18 చోట్ల టెలిమెట్రి పరికరాలు ఏర్పాటు చేయగా, రెండో దశలో ఇంకా 9 చోట్ల ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు అమలు కాకపోవడం సబబు కాదని  పేర్కొన్నారు. 

KRMB నిర్ణయం ధిక్కరిస్తూ టెలీమెట్రి ఏర్పాటు కోసం నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటే ఏపీ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదు? ఎందుకు ఏపీ మీద ఒత్తిడి చేయకుండా మౌనంగా ఉన్నట్లు? అని ప్రశ్నించారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడాల్సిన KRMB, రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని ఆసరాగా చేసుకొని తెలంగాణకు అన్యాయం చేస్తుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ, ఏపీ, కేంద్రంలోని బీజేపీ మూడు కలిసి టెలీమెట్రిల ఏర్పాటును నిర్లక్ష్యం చేస్తూ, తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. టెలీమెట్రి ఏర్పాటు చేస్తున్నాం అని ప్రచారం చేసుకోవడమే తప్ప రెండేళ్ల నుండి కేంద్రం చేసింది ఏం లేదన్నారు. పోలవరం నల్లమల సాగర్ విషయంలో మాదిరిగానే  టెలిమెట్రిల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమన్నారు. కేవలం లేఖలు రాస్తూ కాలయాపన చేయకుండా, నిధులు మళ్లించిన KRMB పై కేంద్ర ప్రభుత్వానికి పిర్యాదు చేయాలని సూచించారు.