హిందూ సమాజంపై అనుచిత వ్యాఖ్యలు…యూట్యూబర్ అన్వేష్ దిష్టిబొమ్మ దగ్ధం!

Spread the love

ప్రముఖ తెలుగు ట్రావెల్ యూట్యూబర్ అన్వేష్ (‘నా అన్వేషణ’ చానల్) హిందూ ధర్మం, భక్తుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ములుగు జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ మేరకు మంగపేట మండలంలోని వైఎస్ఆర్ సెంటర్‌లో బీజేపీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టాయి.ఈ సందర్భంగా అన్వేష్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా అన్వేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు, ముఖ్యంగా హిందూ దేవతలు, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.ఈ వివాదంలో నటుడు శివాజీ, అనసూయ పేర్లు కూడా ప్రస్తావనకు రావడంతో చర్చ మరింత ఉద్ధృతమైంది.హిందూ సమాజాన్ని అవమానించేలా మాట్లాడటం సోషల్ మీడియాలో విద్వేషాలను రెచ్చగొట్టడమేనని బీజేపీ మండల అధ్యక్షులు రావుల జానకిరావు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అన్వేష్‌ను అరెస్ట్ చేయాలని, అతడి యూట్యూబ్ చానల్‌ను తక్షణమే నిషేధించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అన్వేష్‌పై గతంలోనూ కొన్ని నిరాధారమైన ఆరోపణల నేపథ్యంలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజా ఘటనతో హిందూ సంఘాలు & బీజేపీ నేతలు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చే యోచనలో ఉన్నారు.