భారత క్రికెట్ లెజెండరీ సునీల్ గవాస్కర్ మరోసారి తనదైన స్వభావంతో అభిమానుల మనసు గెలుచుకున్నారు. భారత జట్టు మహిళా క్రికెట్ స్టార్ జెమీమా రోడ్రిగ్స్‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అరుదైన ‘బ్యాట్’ఆకారంలో ఉన్న గిటార్ ను ఆమెకు బహుమతిగా అందించారు. తాజాగా జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో వీరిద్దరూ సందడి చేశారు. గతేడాది భారత్ వేదికగా జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై జరిగిన సెమీఫైనల్‌లో జెమీమా 127 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును ఫైనల్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది. ఆ సమయంలో భారత్ వరల్డ్ కప్ గెలిస్తే జెమీమా గిటార్ వాయిస్తుంటే తాను పాట పాడుతానని గవాస్కర్ అన్నారు. నవంబర్ 2న ఫైనల్ లో సౌతాఫ్రికా పై గెలిచిన భారత్ ప్రపంచకప్ కలను సాకారం చేసుకుంది. అనంతరం జెమీమా తన సోషల్ మీడియా వేదికగా “సన్నీ సార్.. నేను గిటార్‌తో రెడీ, మీరు మైక్‌తో సిద్ధమేనా?” అంటూ గవాస్కర్ ను అడిగారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 ప్రారంభానికి ముందు జరిగిన ఈ భేటీలో గవాస్కర్ స్వయంగా జెమీమా వద్దకు వెళ్లి ఈ ప్రత్యేకమైన గిటార్‌ను అందజేశారు.