సిరిసిల్లలో ‘మెగా పవర్ లూమ్ క్లస్టర్’ ఏర్పాటు చేయాలనే డిమాండ్ నిన్న మొన్నటిది కాదని, గత పదేళ్లుగా దీనిపై తాము నిరంతరాయంగా పోరాడుతున్నామని బీ.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ అన్నారు. సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు విషయంపై కేంద్ర టెక్స్ టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కు లేఖ రాశారు. గతంలో మంత్రిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, సిరిసిల్ల శాసన సభ్యుడిగా పూర్వపు టెక్స్ టైల్ శాఖా మంత్రులకు రాసిన అనేక లేఖలు, అనేక వ్యక్తిగత సమావేశాలు మరియు అధికారిక విజ్ఞప్తులు ఇప్పటివరకు కేంద్రం నుండి ఎటువంటి సానుకూల నిర్ణయానికి నోచుకోకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. CPCDS నిబంధనల ప్రకారం సిరిసిల్లకు అన్ని అర్హతలు ఉన్నాయని కేంద్ర బృందాలే ధృవీకరించినా, ఫైళ్లను పక్కన పెట్టడం వెనుక ఉన్న మర్మమేమిటి? అని ప్రశ్నించారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, తెలంగాణ అభివృద్ధిని, ముఖ్యంగా ఇక్కడి నేతన్నల పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష అని ధ్వజమెత్తారు. సిరిసిల్ల తెలంగాణ వస్త్ర పరిశ్రమకు గుండెకాయని పేర్కొన్న కేటీఆర్, అక్కడ 30 వేలకు పైగా పవర్ లూమ్స్ కలిగి ఉండి, వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
సిరిసిల్ల కంటే తక్కువ సామర్థ్యం, తక్కువ కార్మిక శక్తి ఉన్న ఇతర రాష్ట్రాలలోని ప్రాంతాలకు మెగా క్లస్టర్లను మంజూరు చేసిన కేంద్రం, అన్ని అర్హతలు ఉన్న సిరిసిల్లను పక్కన పెట్టడం ప్రాంతీయ వివక్షేనని సిరిసిల్లకు మెగా క్లస్టర్ రాకపోవడానికి కారణం మెరిట్ లేకపోవడం కాదు, కేంద్రానికి తెలంగాణపై ఉన్న కక్షే అని దుయ్యబట్టారు. ఒకవైపు ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ అని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్రం, దేశంలోనే అత్యంత సామర్థ్యం కలిగిన సిరిసిల్ల వంటి వస్త్ర పరిశ్రమ కేంద్రానికి మద్దతు ఇవ్వకపోవడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ద్వంద నీతికి, చిత్తశుద్ది లేమికి అద్దం పడుతున్నారు.