ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన మార్కెట్లలో ఒకటిగా భారత్

Spread the love

భారత్ తో వాణిజ్యం కోసం ప్రపంచ దేశాల ఆసక్తి కనబరుస్తూనే ఉన్నాయి. తాజాగా ట్రేడ్, కీలక ఖనిజాలు, ఇంధనం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించే దిశగా భారత్-కెనడా కీలక అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న కెనడా ఇంధన మంత్రి టిమ్ హడ్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన మార్కెట్లలో ఒకటిగా భారత్ అభివృద్ధి చెందుతోందని  ఇంధన రంగంలో కెనడా సూపర్  పవర్ కావాలంటే భారత్ తో  వ్యాపారం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.  ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలను, ఎనర్జీ ట్రేడ్ ను  మరింత ముందుకు తీసుకువెళ్లడానికి కృషి చేస్తున్నామన్నారు.ఆయిల్, గ్యాస్ వాణిజ్యాన్ని విస్తరించడానికి భారత్ కు  ముడి చమురు, పెట్రోలియం, సహజ వాయువులను రవాణా చేసేందుకు  కెనడా సిద్ధంగా ఉందని టిమ్ హడ్సన్ పేర్కొన్నారు. కెనడా మంత్రితో చర్చల అనంతరం భారత పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పందిస్తూ కెనడా-భారత్ ల మధ్య పలు వాణిజ్య ఒప్పందాలపై చర్చలు కొనసాగుతోన్నట్లు తెలిపారు. హైడ్రోజన్, బయో ఇంధనాలు, బ్యాటరీ నిల్వ, కీలకమైన ఖనిజాలు, విద్యుత్ వ్యవస్థలు, ఇంధన పరిశ్రమలో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ వినియోగం వంటి విషయాలపై దృష్టి సారించినట్లు తెలిపారు.  2050 నాటికి ప్రపంచ ఇంధన డిమాండ్లో మన వాటా 30 నుంచి 35 శాతం పెరుగుతుందని భారత్ మూడో అతిపెద్ద ఇంధన మార్కెట్ గా అవతరిస్తుందన్నారు.