ఆదివాసీల అతిపెద్ద పండుగ అయిన మేడారం సమ్మక్క – సారలమ్మ పుణ్యక్షేత్రం పునరుద్ధరణ పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు అంకితం చేశారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో సీఎం కుటుంబ సమేతంగా సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ఆశీర్వాదం స్వీకరించారు. దాదాపు వెయ్యేళ్ల వీరగాథకు, జాతి వారసత్వ సంపదకు సంబంధించిన చరిత్రకు అద్దం పట్టేలా రూపుదిద్దుకున్న మేడారం గద్దెలు, ఆలయ ప్రాంగణాన్ని పునఃప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రివర్గ సహచరులు, ప్రజాప్రతినిధులతో కలిసి అమ్మవార్లను దర్శించుకున్నారు. అంతకుముందు గద్దెల ప్రాంగణంలో పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు.