తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ తీరుపై కూటమి పక్షాలు మండిపడుతున్నాయి. మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందిస్తూ వారి పార్టీ ఛానెల్ ఇచ్చిన క్లీన్ చిట్ ను సిట్ ఇచ్చినట్లు ప్రచారం చేసుకోవడం విడ్డూరమని అన్నారు. మహాపాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు విష ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కల్తీ జరిగిందని సిట్ నివేదికలో నిర్ధరణ అయినా సంబరాలా? అని ప్రశ్నించారు. ఇకనైనా దేవుడితో ఆటలాపితే వాళ్లకే మంచిదని మంత్రి హితవు పలికారు. ఐదేళ్ల జగన్ పాలనలో తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూలు 20 కోట్లు నెయ్యి పేరుతో కెమికల్స్ కలిపి తయారు చేసి పంపిణీ చేశారు. ఈ మహాపాపంను సుప్రీంకోర్టు వేసిన సిట్ నిర్ధారించిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో కొందరు ప్లెక్సీలు కూడా పెట్టారు. పట్టణంలోని కూడళ్లలో వీటిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మహా పాపం నిజం. 68.17లక్షల కిలోల కల్తీ నెయ్యి వినియోగించారు. దాంతోనే 20కోట్ల లడ్డూలు తయారీ. వైసీపీ పెద్దలు రూ.251 కోట్లు తమ జేబుల్లో వేసుకున్నారని వాటిపై పేర్కొన్నారు. అది నెయ్యే కాదు. పామాయిల్ కెమికల్ కలిపిన ద్రవం. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో సిట్ స్పష్టీకరణ అని ఆ ఫ్లెక్స్ లలో పేర్కొన్నారు. ప్లెక్సీలపై మాజీ సీఎం జగన్ తో పాటు టీటీడీ మాజీ ఛైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఫొటోలను వేశారు.