ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం..పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

Spread the love

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ముగిసింది.ఈ సమావేశంలో కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. టీటీడీ లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీపై సిట్ ఇచ్చిన నివేదికపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. సిట్ నివేదికపై వైసీపీ  చేస్తున్న దుష్ప్రచారంపై చర్చించారు. దీనిపై సిట్ నివేదిక తెప్పించాలని కేబినెట్ కోరింది. ఇప్పటికే సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ ఛార్జిషీట్ వేసిన విషయాన్ని అధికారులు తెలిపారు. సిట్ నివేదిక అధికారికంగా వచ్చిన తర్వాత  దానిపై స్పందించాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. ఇక ఈ సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను చూస్తే పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. అర్జున అవార్డు గ్రహీత జ్యోతికి విశాఖలో 500 చదరపు గజాల స్థలం ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. డిగ్రీ తర్వాత గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఏపీ టిడ్కోకు హడ్కో నుంచి రూ.4,451 కోట్ల ప్రభుత్వ రుణ గ్యారెంటీకి ఆమోదం తెలిపింది. ఎస్వీ వర్సిటీ పరిధిలోని 33 ఎకరాల భూమిని వ్యవసాయ మార్కెట్ కమిటీకి బదిలీపై చర్చ జరిగింది. పలమనేరులో లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటుకు భూ బదిలీ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  అమరావతి పరిధిలోని వీధిపోటు భూములు పొందిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లకు ఆమోదం తెలిపింది. అల్లూరి జిల్లా నందకోటలో పర్యాటక శాఖ ఫైప్టార్ రిసార్ట్, కన్వెన్షన్ సెంటర్, థీమ్ పార్కు ఏర్పాటుకు భూకేటాయింపులకు ఆమోదం తెలిపింది. అమరావతి పరిధిలో భూములు లేని పేదలకు, అనాథ పిల్లలకు పింఛన్ల మంజూరుకు ఆమోదం తెలిపింది.  టీటీడీ పరిధిలో పలు పోస్టుల అప్గ్రేడ్కు, పలు సంస్థలకు భూకేటాయింపులకు పచ్చజెండా ఊపింది. పలు జలవనరుల ప్రాజెక్టులకు ఆర్థిక అనుమతులకు ఆమోదం లభించింది. ఇంధనశాఖలో పలు పరిపాలన అనుమతులకు ఆమోదం దక్కింది.