తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం. శ్రీ వేంకటేశ్వర స్వామి మా ఇంటిదైవమని అన్నారు. గత పాలనలో శ్రీవారి ప్రసాదం విషయంలో అపచారం చోటు చేసుకుందని పేర్కొన్నారు. కూటమి నేతలతో కలిసి ఆయన నేడు మీడియాతో మాట్లాడారు. లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, పలువురు మంత్రులతో కలిసి సీఎం కీలక భేటీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీపై విమర్శలు గుప్పించారు. తప్పుచేసి దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు తమపై వైసీపీ నేతలు దుష్ప్రచారంచేస్తున్నారని మండిపడ్డారు. బూతులు తిట్టినా మేం భరించాలా? అని ప్రశ్నించారు. దోషులను అన్ని విధాలుగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని సీబీఐ ఒక నివేదిక పంపిందని ఏక సభ్య కమిషన్ వేసి అన్నీ పరిశీలించనున్నట్లు తెలిపారు. అవసరమైతే కోర్టులో కూడా అదనపు సమాచారం చేరుస్తాం. ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం. ఒకప్పుడు ఏడు కొండలు కాదు.. రెండు కొండలని అసెంబ్లీలో మాట్లాడారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని అప్పుడే చాలా స్పష్టంగా చెప్పామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పిచ్చి పరాకాష్ఠకు చేరింది. విగ్రహాల ధ్వంసాన్ని ప్రశ్నిస్తే హేళనగా మాట్లాడారని తప్పు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాల్సింది పోయి తమపైనే ఎదురుదాడికి దిగారని మండిపడ్డారు. 2022లో నెయ్యి కల్తీపై నివేదిక వస్తే అప్పటి పాలకులు ఎందుకు తొక్కిపెట్టారని ప్రశ్నించారు. తప్పు జరుగుతోందని తెలిసి కూడా దాన్ని కొనసాగించారు. సీఎం అయిన తరువాత ప్రక్షాళన మొదలుపెట్టినట్లు తెలిపారు. పొరపాటు జరుగుతోందని శాంపిల్స్ ను టెస్టులకు పంపాం. ఎన్డీడీబీ నివేదికలోని అంశాన్నే తాను ప్రస్తావించిన అంశాన్ని గుర్తుచేశారు. వైసీపీ నేతలకు దేవుడంటే లెక్కలేనితనమనుకోవాలా? నమ్మకం ఉండే భక్తుల మనోభావాలను దెబ్బతీయాలనేది మీ లక్ష్యమా? అని ప్రశ్నించారు. దేవుడి పవిత్రతను దెబ్బతీయడం మహాపాపమని మండిపడ్డారు. ఇంతవరకు చరిత్రలో వెంకన్నస్వామి జోలికి ఎవరూ రాలేదు. దేవుడికి అపచారం జరిగినప్పుడు అందరూ ఖండించాల్సిన బాధ్యత ఉందన్నారు. దేవుడితో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.