స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృదుల్ కుమార్ తో మంత్రి లోకేష్ భేటీ

Spread the love

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల కల్పనే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు స్విట్జర్లాండ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, భారత రాయబారి మృదుల్ కుమార్ తో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ నేడు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ స్విట్జర్లాండ్ తో వాణిజ్య సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు ఏపీ  ఆసక్తిగా ఉందని తెలిపారు. ఇందుకోసం స్విస్ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నామని పేర్కొన్నారు. టెక్నాలజీ, టెక్స్ టైల్, మెషీన్ మ్యానుఫ్యాక్చరింగ్,, హార్డ్ వేర్, ఎలక్ట్రానిక్స్, ట్రైన్, ట్రైన్  విడిభాగాల తయారీ, ఫార్మాస్యూటికల్స్, ఆర్ అండ్ డి సెంటర్స్, యూనివర్సిటీలతో  సహకారం వంటి రంగాల్లో తాము స్విస్ సహకారాన్ని కోరుకుంటున్నట్లు లోకేష్ వివరించారు.  నెస్లే, రోచె, నోవార్టిస్, ఎబీబీ, లైబెర్ ఇంజనీరింగ్, ఫెర్రింగ్ ఫార్మాస్యూటికల్స్, క్లారియంట్, హిల్టి, బుహ్లర్, బుచర్, ఎస్ టీ టెలిమీడియా, ఓసీ ఓర్లికాన్ వంటి కంపెనీలు తమ యూనిట్లను ఏపీలో నెలకొల్పేలా ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కోరారు. స్విస్ లోని జ్యురిచ్ యూనివర్సిటీ, బాసెల్ యూనివర్సిటీ, బెర్న్ యూనివర్సిటీ, జెనీవా యూనివర్సిటీ  వంటి ప్రఖ్యాత వర్సిటీలను ఏఐ, ఫార్మా, మెడికల్ డివైస్, స్టార్టప్, ఎక్స్చేంజి ప్రోగ్రామ్ లపై ఏపీ వర్సిటీలను అనుసంధానించడంలో మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలుగు డయాస్పోరా ఏపీ రాష్ట్ర  అభివృద్ధికి దోహదపడుతోంది. స్విట్జర్లాండ్‌లో భారతదేశ టెక్నీకల్ టాలెంట్ కు  భారీ డిమాండ్ ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మరింత మంది సాంకేతిక నిపుణులను స్విట్జర్లాండ్ కు పంపేందుకు  సహకారం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ నుంచి స్విట్జర్లాండ్ కు వచ్చే విద్యార్థులకు అవసరమైన సహాయ, సహకారాలు అందించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. దీనిపై స్విస్ లోని భారత రాయబారి మృదుల్ కుమార్ సానుకూలంగా స్పందించారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చొరవకు తమవంతు సహకారం అందిస్తానని మృదుల్ కుమార్ పేర్కొన్నారు.