ఏపీసీసీ ఛీఫ్ వై.ఎస్.షర్మిల చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట ( MGNREGA) పరిరక్షణ యాత్ర 6 వ రోజు తిరుపతి జిల్లాలో సాగింది. సూళ్లూరుపేట నియోజక వర్గం, కోటపోలూరు గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులనుద్దేశించి మాట్లాడారు. మన్రేగా పథకంలో మహాత్మాగాంధీ పేరు తొలగించడం దారుణమని అన్నారు. బీజేపీ తీసుకొచ్చిన VBGRAM G చట్టం మన్రేగాకు ప్రత్యామ్నాయం కానేకాదని పేర్కొన్నారు. ఇది పేదల పొట్ట కొట్టే చట్టం. ఉపాధికి ఊపిరి తీసిన చట్టమని ఆరోపించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఉపాధి హామీ పథకం అంటే ఒక పండగ. ఇప్పుడు ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ భ్రష్టు పట్టించిందని విమర్శించారు. మన్రేగా కింద పనులు గ్రామసభలవి. గ్రామాలకు ఏం కావాలో గ్రామసభలే నిర్ణయిస్తాయి. ఇప్పుడు ఉపాధి హామీ పనులపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ గ్రామ్ జి చట్టానికి చంద్రబాబు మద్దతు ఇవ్వడానికి సిగ్గుండాలి. మళ్లీ కేంద్రం దగ్గరకు వెళ్లి నిధులు ఎలా అడుగుతున్నారు?సీఎం చంద్రబాబు , మాజీ సీఎం జగన్ ఇద్దరూ ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర సాగిలపడి రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ శ్రామికుల పక్షాన రోడ్డెక్కింది. ఈ ఉపాధి హామీ పరిరక్షణ పోరాటం చేస్తుంది. దీనికి ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసైనా మన్రేగా పథకం కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.