అనపర్తి నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. విశాఖపట్నం-లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12805/12806) ఇకపై అనపర్తి రైల్వే స్టేషన్‌లో కూడా ఆగనుంది. ఈ రైలు హాల్టింగ్‌ను నేడు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు.ఈరోజు అనపర్తి రైల్వే స్టేషన్ నుండి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రారంభం పట్ల ఎంపీ పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. అనపర్తిలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ హాల్ట్ ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని,హాల్ట్ సాధించాలని కృషి చేసినట్లు తెలిపారు. రైలు నిలుపుదలకు అనుమతి మంజూరు చేసినందుకు కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్, ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే అధికారులకు, సహకరించిన రిటైర్డ్ రైల్వే అధికారులకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇక అనపర్తి సహా పరిసర ప్రాంతాల ప్రజలు దీనిపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.