టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో కలిసి శిక్షణ తరగతులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై దిశా నిర్దేశం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ బలం, బలగం కార్యకర్తలని పునరుద్ఘాటించారు. దేశంలో అభివృద్ధి, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని పేర్కొన్నారు. అనేక పరిశ్రమలు ఏపీకి వస్తున్నాయంటే కారణం చంద్రబాబు నాయకత్వమేనని స్పష్టం చేశారు. చేసిన పనులు చెప్పుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని శ్రేణులతో అన్నారు.గ్రామ పార్టీ అధ్యక్షుడు పొలిట్ బ్యూరో వరకు ఎదగాలని ఆకాంక్షించారు.ఒక్క పెన్షన్ లకే ఏడాదికి రూ.30వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు.ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటున్నాం. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా రూ.4వేల వృద్ధాప్య పెన్షన్ చెల్లిస్తున్నాం. వికలాంగులకు రూ.6వేలు ఇస్తున్నాం. మంచానికే పరిమితమైన వారికి రూ.15వేలు చెల్లిస్తున్నాం. ఒక్క పెన్షన్ లకే ఏడాదికి రూ.30వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు అండగా నిలిచాం. యువగళం కింద రూ.20 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషిచేస్తున్నాం. ప్రతిపక్ష పార్టీ 200 కేసులు వేసినా కూటమి ప్రభుత్వంలో 150 రోజుల్లోనే డీఎస్సీ పూర్తిచేసి 16వేల మందికి ఉద్యోగాలు కల్పించాం. 6వేల మందిని పోలీస్ కానిస్టేబుల్స్ గా నియమించాం. పెద్దఎత్తున పెట్టుబడులు తీసుకువస్తున్నాం. దేశంలో 25 శాతం పెట్టుబడులు ఒక్క ఏపీకే వస్తున్నాయి. రోడ్లపై గుంతలు పూడ్చేందుకు రూ.2వేల కోట్లు ఖర్చు చేశాం. మిగిలిన సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలుచేస్తామని స్పష్టం చేశారు. ఇక కల్తీ నెయ్యి, కోడికత్తి, కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్లు టీం 11 అంటూ వైసీపీపై విమర్శలు గుప్పించారు. తెలుగుజాతి కోసం పుట్టిన పార్టీ టీడీపీ. ప్రపంచంలో ఏ రంగం చూసినా తెలుగువారు నెం.1గా ఉండే విధంగా మనం కృషిచేయాలి. అదే మన లక్ష్యమని పేర్కొన్నారు.