పిఠాపురం నుండి గెలిచి జాతీయ స్థాయిలో జనసేన పేరు వినపడేలా పనిచేస్తున్నా:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

Spread the love

పిఠాపురం నియోజకవర్గం, ఓ. బి. ఎస్ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైన పీఠికాపుర సంక్రాంతి మహోత్సవ వేడుకల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంస్కృతులను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు హస్తకళలు, చేనేత కళలు గొప్పదనాన్ని చాటేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. పిఠాపురం నుండి గెలిచి జాతీయ స్థాయిలో జనసేన పేరు వినపడేలా పనిచేస్తున్నానని పవన్ పేర్కొన్నారు. తనను  పిఠాపురం వరకు పరిమితం చేయకండని అన్నారు. పేరంటాలకు, ఫంక్షన్లకు అటెండ్ కావడం కంటే పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.    గత ప్రభుత్వ హాయంలో పిఠాపురం నియోజకవర్గానికి ఎన్ని కోట్లు కేటాయించి పనులు చేశారో చూడండి, నేను పిఠాపురం MLA గా గెలిచాక కేవలం తొలి సంవత్సరంలో రూ.308 కోట్లు కేటాయించి ఈ మార్చి నాటికి పనులు కూడా పూర్తి చేసేలా అభివృద్ధి చేపట్టామన్నారు.  ఇది ప్రజలు గమనించాలని కోరారు.  నేను  ఇక్కడ ఉండటం కంటే కూడా, నేను లేకపోయినా మీ పనులు పూర్తయ్యే వ్యవస్థ ఏర్పాటు చేయడం ముఖ్యమని పవన్ స్పష్టం చేశారు.  నేను ఉంటేనే, నన్ను కలిస్తేనే పనులు అవుతాయి అంటే అది పరిపాలన వైఫల్యంగా నేను భావిస్తాను. ఈరోజు పిఠాపురం సింగపూర్ తరహాలో వ్యక్తి మీద ఆధారపడకుండా వ్యవస్థ పనిచేసేలా తీర్చిదిద్దుతున్నాము. పని చేసే నాయకులను గుర్తించాల్సిన బాధ్యతలను నాయకత్వం తీసుకోవాలి. ఎన్నికలు అయిపోయాయి అని వదిలేస్తే ఉప్పాడ ప్రొటెక్షన్ వాల్ వచ్చేదా? అని ప్రశ్నించారు. పిఠాపురంలో ఒక స్కూళ్లో ఇద్దరు చిన్నపిల్లలు మాట మాట అనుకుని కొట్టుకుంటే అది పెద్ద వార్త చేసి నేను బాధ్యత అంటారు, పులివెందులలో సొంత బాబాయి హత్యకు గురైతే అది వార్త అవ్వదు. నాయకులే కొట్టుకుంటుంటే స్కూల్లో ఇద్దరు పిల్లలు మాట మాట అనుకోకుండా ఉంటారా? అది కూడా పెద్ద గొడవలా మార్చాలని ప్రయత్నించారన్నారు. పిఠాపురంలో చిన్న చెట్టు మీద పక్షి ఈక రాలిపడినా పెద్ద వార్త అయిపోతుంది, తాటాకు చప్పుడు కూడా వైరల్ చేస్తున్నారు. ఎవరో వచ్చి ఇక్కడ ప్రజల మధ్య సంబంధాలు చెడగొట్టాలని చూస్తున్నారు. ప్రజలు గమనించాలని సూచించారు.  ఇతర ఏ ప్రముఖ నాయకుల  నియోజకవర్గాల్లో ఇలా జరగదు. క్కడా ఉన్నా నా  గుండెల్లో పిఠాపురం ఉంటుంది అనే విషయం పిఠాపురం ప్రజలు గుర్తుపెట్టుకోండంటూ పవన్ వ్యాఖ్యానించారు.