అప్పుల ఊబిలో పాకిస్థాన్.. టాప్ ఎకానమీగా ఎదుగుతామంటున్న ప్రధాని!

ఒక వైపు తమ దేశం దుర్భర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మాత్రం ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోయేలా ఒక సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయిన తమ దేశం.. 2050 నాటికి ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆయన ఒక విజన్ డాక్యుమెంట్‌ను ప్రకటిస్తూ గొప్పలు చెప్పుకొచ్చారు. పాకిస్థాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి అక్కడి పాలకులు ఎప్పుడూ ఏదో ఒక కొత్త నాటకానికి తెరతీస్తూనే ఉంటారు. తాజాగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ.. 2050 నాటికి పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే ఆరవ స్థానానికి చేరుకుంటుందని దేశ భవిష్యత్తు కోసం ఒక ప్రణాళికను రెడీ చేస్తున్నామని, కీలక రంగాల్లో భారీ పెట్టుబడులు పెడతామని చెప్తున్నారు. అయితే పాకిస్థాన్ ఈ రోజు ఈ స్థితిలో ఉండటానికి కారణం కేవలం తీవ్రవాదాన్ని పెంచి పోషించడం, అప్పుల మీద అప్పులు చేయడమే. ఈ వాస్తవాన్ని అంగీకరించని పాలకులు, తాము ఒక అద్భుతమైన రోడ్‌మ్యాప్ తయారు చేశామని, రాబోయే పాతికేళ్లలో దేశ ముఖచిత్రం మారిపోతుందని ప్రజలకు మాయమాటలు చెప్తూనే వస్తున్నారు. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించడానికి యువత నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెడతామని, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి స్పెషల్ ఎకనామిక్ జోన్లను అభివృద్ధి చేస్తామని షరీఫ్ చెబుతున్నారు.
అయితే పాకిస్తాన్ లో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఒకవైపు పెరిగిపోయిన ద్రవ్యోల్బణం , మరోవైపు చుక్కలు చూపిస్తున్న నిత్యావసరాల ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. పాక్ ఇప్పుడు పీకల్లోతు అప్పుల ఊబిలో ఉంది. ఒక పాత అప్పుకు వడ్డీ కట్టాలంటే, మళ్లీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గరకు వెళ్లి లేదా చైనా దగ్గరకు వెళ్లి ఇంకో కొత్త అప్పు చేయాల్సిన పరిస్థితిలో ఆ దేశం ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్ మొత్తం విదేశీ అప్పు దాదాపు 130 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. వాళ్ల జీడీపీలో సగానికి పైగా ఆదాయం కేవలం అప్పుల వడ్డీలు కట్టడానికే సరిపోతోంది. కరెంటు బిల్లులు సామాన్యులు తమ ఇళ్లలోని ఫ్యాన్లు, ఏసీలు అమ్ముకుని మరీ బిల్లులు కడుతున్నారు. పరిశ్రమలన్నీ మూతపడుతున్నాయి, విదేశీ కంపెనీలు పాకిస్థాన్‌ను వదిలి పారిపోతున్నాయి. ఇలాంటి దారుణమైన పరిస్థితి పెట్టుకుని.. ఏకంగా అమెరికా, చైనా, ఇండియా, జపాన్, జర్మనీ లాంటి దేశాల సరసన 6వ స్థానంలో కూర్చుంటామని పాక్ ప్రధాని చెప్పడం హాస్యాస్పదమనే అభిప్రాయం అంతర్జాతీయ ఆర్థిక నిపుణుల నుండి వ్యక్తమవుతోంది.
ఇక పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనం అవ్వడానికి ప్రధాన కారణం చైనా వేసిన వల. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ పేరుతో డ్రాగన్ కంట్రీ పాకిస్థాన్‌లో భారీగా అప్పులు ఇచ్చి ప్రాజెక్టులు కట్టింది. కానీ ఆ ప్రాజెక్టుల వల్ల పాకిస్థాన్‌కు వచ్చిన లాభం మాత్రం ఏమిలేదు. చైనా దగ్గర తీసుకున్న అధిక వడ్డీ రుణాల వల్ల పాకిస్థాన్ పూర్తిగా అప్పుల ఊబిలో చిక్కుకుపోయింది. అప్పులు తీర్చలేక గ్వాదర్ పోర్ట్ లాంటి కీలకమైన మౌలిక సదుపాయాలను చైనాకు రాసిచ్చే పరిస్థితి వచ్చింది. అంతేకాదు, తమ దేశంలోని ఎయిర్‌పోర్టులను, ప్రభుత్వ రంగ సంస్థలను కూడా గల్ఫ్ దేశాలకు అమ్ముకుంటూ, లీజుకు ఇస్తూ దేశాన్ని అక్షరాలా కుదువపెడుతున్నారు అక్కడి పాలకులు. ఒకవైపు తీవ్రవాద సంస్థల కారణంగా దేశంలోకి ఏ ఒక్క విదేశీ కంపెనీ పెట్టుబడులు తీసుకురావడం లేదు. వీటికి తోడు రాజకీయ అస్థిరత. ఇలా ఎన్నో కారణాలు. అసలు లాజికల్‌గా ఆలోచిస్తే, పాకిస్థాన్ ప్రధాని చెప్పినట్లు 2050 నాటికి 6వ స్థానానికి వెళ్లడం సాధ్యమేనా? ప్రస్తుతం పాకిస్థాన్ జీడీపీ సుమారు 350 బిలియన్ డాలర్లు మాత్రమే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల ర్యాంకింగ్‌లో అది కనీసం టాప్ 40లో కూడా లేదు . అలాంటి దేశం టాప్ 6లోకి రావాలంటే.. రాబోయే పాతికేళ్ల పాటు ప్రతి ఏడాదీ రెండంకెల వృద్ధి రేటును సాధించాలి. కానీ ప్రస్తుతం పాక్ వృద్ధి రేటు 2 నుంచి 3 శాతం మించడం లేదు. మరోవైపు భారతదేశం ఇప్పటికే 5వ స్థానంలో ఉంది, త్వరలోనే మూడవ స్థానానికి వెళ్లబోతోంది. ప్రపంచ దేశాలన్నీ ఏఐ , సెమీకండక్టర్లు, టెక్నాలజీ వైపు పరుగులు తీస్తుంటే, పాకిస్థాన్ మాత్రం ఇంకా ఉగ్రవాద ముద్ర పోగొట్టుకునే దిశగా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. ఎటువంటి కీలక చర్యలు తీసుకోకుండా కేవలం మాటలకే పరిమితమై కేవలం ఐఎంఎఫ్ అప్పుల మీద, చైనా దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్న పాకిస్థాన్.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 6వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని చెప్పడం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ అని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.



