సరిహద్దుల్లో కొత్త ముప్పు.. పాక్ చేతికి లక్ష ఎఫ్‌పీవీ డ్రోన్లు?

పాక్ ఉగ్రవాదానికి గట్టిగా బుద్ధిచెప్పేందుకు భారత్ చేసిన ఆపరేషన్ సిందూర్ ఇప్పటికీ పాక్ ఒక సింహస్వప్నంగా భయపెడుతూనే ఉంది. భారత సైన్యం ప్రయోగించిన పవర్ఫుల్ క్షిపణులు, ఎయిర్ డిఫెన్స్ సామర్థ్యాల దెబ్బకు పాకిస్థాన్ మిలిటరీ కుదేలైపోయింది. ఆ దెబ్బతో పాక్ వెన్నుముక విరిగిపోయింది. కానీ బుద్ధి గడ్డితిన్న దాయాది దేశం ఎప్పటికైనా భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతూనే ఉంటుంది. సాంప్రదాయ యుద్ధంలో ఇండియన్ ఆర్మీని ఎదుర్కోలేమని ఎప్పుడూ దొడ్డిదారిన దుష్టపన్నాగాలు పన్నుతూనే ఉంటుంది. తాజాగా మరో కొత్త తరహా యుద్ధానికి తెరతీస్తోంది. భారత్‌ను ఎదుర్కోవడానికి తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్న పాకిస్థాన్, తన మిత్రదేశమైన టర్కీ తో ఒక భయంకరమైన డీల్ కుదుర్చుకుంది. బ్రహ్మోస్ లాంటి క్షిపణులు కాదు.. ఏకంగా ఒక లక్ష మెర్కుట్ ఎఫ్‌పీవీ డ్రోన్లను కొనుగోలు చేయడానికి టర్కీతో మూడేళ్ల ఒప్పందంపై సంతకాలు చేసింది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ మిలిటరీ పూర్తిగా ఆత్మరక్షణలో పడింది. మళ్లీ ఆర్మీని బలోపేతం చేయడానికి భారీగా ఖర్చు చేసే స్థోమత ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు లేదు. అందుకే తక్కువ ఖర్చుతో ఎక్కువ విధ్వంసం సృష్టించే మానవరహిత డ్రోన్ల పై పాక్ చూపు పడింది. ఇందుకోసం టర్కీకి చెందిన ప్రముఖ డిఫెన్స్ సంస్థ ఉలుసఉన్మా తో పాకిస్థాన్ ఏఆర్టీసీ ఒక భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ కేవలం లక్ష ఎఫ్‌పీవీ డ్రోన్లకు మాత్రమే పరిమితం కాలేదు. ఈ ఒప్పందం ప్రకారం పాకిస్థాన్ చేతికి పది ఆల్పైన్ మానవరహిత హెలికాప్టర్లు, 25 డుమ్రుల్ మినీ హెలికాప్టర్లు, 500 డీఎల్ఈ లాయిటరింగ్ మ్యూనిషన్ సిస్టమ్స్ , 250 కోర్గాన్ గ్రౌండ్ వ్యవస్థలు పాకిస్థాన్‌కు చేరనున్నాయి. ఈ ఒప్పందంలో ఉన్న అతిపెద్ద డేంజర్ ఏంటంటే.. కేవలం ఈ డ్రోన్లను టర్కీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం మాత్రమే కాదు, భవిష్యత్తులో పాకిస్థాన్ లోనే వీటి తయారీ ఫ్యాక్టరీలను కూడా ఏర్పాటు చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. దీనివల్ల పాక్ ఉగ్రవాదుల చేతికి కూడా ఈ డ్రోన్లు సులువుగా చిక్కే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.ఈ మెర్కుట్ ఎఫ్‌పీవీ డ్రోన్ల రేంజ్ 8 కిలోమీటర్లు ఉంటుంది. అంటే బోర్డర్ అవతల 8 కిలోమీటర్ల దూరంలో ఉండి, ఎల్ఓసీ దాటి ఇండియాలోని టార్గెట్లపై దాడి చేయవచ్చు. ఇవి గాల్లో దాదాపు 20 నుండి 30 నిమిషాల పాటు నిరంతరాయంగా ప్రయాణించగలవు. ఈ డ్రోన్ల ముందు భాగంలో అమర్చిన వార్‌హెడ్‌లో ఏకంగా 1,000 వరకు చిన్నచిన్న 3 ఎంఎం స్టీల్ బాల్స్ టార్గెట్‌ను ఢీకొట్టి డ్రోన్ పేలిన వెంటనే బుల్లెట్ల వేగంతో నలుదిశలా విధ్వంసం సృష్టించగలవు. డ్రోన్ పేలిన తర్వాత కచ్చితంగా 20 మీటర్ల రేడియస్‌లో భయంకరమైన విధ్వంసం సృష్టిస్తాయి. ఇక ఎఫ్‌పీవీ డ్రోన్లతో పాటు పాకిస్థాన్ కొనుగోలు చేస్తున్న అల్పైన్ మానవరహిత హెలికాప్టర్లు కూడా అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి ఏకంగా 200 కిలోల బరువైన పేలుడు పదార్థాలను సరిహద్దులు దాటించి మరీ దాడులకు తీసుకెళ్లగలవు.. ఇవే కాదు, భవిష్యత్తు కోసం పాక్-తుర్కియే కలిసి ఏకంగా 5వ జెనరేషన్ ఫైటర్ జెట్లు తయారు చేయాలని కూడా నిర్ణయించాయి. పాకిస్థాన్ దివాళా తీసినా సరే, సైనిక వ్యవస్థ కోసం, భారత్‌ను ఎదుర్కోవడం కోసం అప్పులు చేసి మరీ ఆయుధాలు కొంటోందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
యుద్ధరంగంలో అత్యధిక నష్టం కలిగిస్తున్నవి ఎఫ్‌పీవీ (ఫస్ట్ పర్సన్ వ్యూ) డ్రోన్లు. వీటి ముందు భాగంలో ఉండే హై-రిజల్యూషన్ కెమెరా ద్వారా చిత్రాలను ఆపరేటర్లు ఎఫ్‌పీవీ గాగుల్స్‌లో ప్రత్యక్షంగా చూస్తూ నియంత్రిస్తారు. చెట్ల మధ్య నుంచి, భవనాల కిటికీల గుండా కూడా ప్రయాణించి లక్ష్యాన్ని ఢీకొట్టగలవు. ఆటోపైలట్‌పై కాకుండా పూర్తిగా రిమోట్‌తో పనిచేసే ఈ డ్రోన్లను ఆపరేటర్లు సురక్షితమైన బంకర్లలో ఉండి, యాంటెన్నాల సాయంతో 2 నుంచి 8 కిలోమీటర్ల దూరం నుండే కంట్రోల్ చేయవచ్చు. దీంతో సైనికులు నేరుగా యుద్ధరంగంలోకి వెళ్లకుండానే దాడులు చేసే అవకాశం ఉంటుంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో ఎఫ్‌పీవీ డ్రోన్ల విధ్వంసక శక్తి ప్రపంచానికి తెలిసింది. తక్కువ ఖర్చుతో శత్రువుల కోట్ల రూపాయల విలువైన ట్యాంకులను సైతం ధ్వంసం చేయగలగడం వీటి ప్రత్యేకత. ఒక్కో డ్రోన్ ధర సుమారు 500 డాలర్లు అంటే రూ.47 వేల లోపు మాత్రమే. ఉక్రెయిన్ 2025లో తన సైన్యానికి ఏకంగా 30 లక్షల డ్రోన్లను సరఫరా చేసింది. రోజువారీ దాడుల్లో సుమారు 60 శాతం ఎఫ్‌పీవీ డ్రోన్ల ద్వారానే జరుగుతున్నట్లు అంచనాలు చెబుతున్నాయి. జామర్లను ఎదుర్కొనేందుకు రేడియో సిగ్నల్స్‌కు బదులుగా ఫైబర్ ఆప్టిక్ వైర్లతో పనిచేసే డ్రోన్లను కూడా వినియోగిస్తున్నారు. ఈ టెక్నాలజీ పాకిస్థాన్‌కు అందుబాటులోకి వస్తే భారత్‌కు భద్రతాపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ఇండియన్ ఆర్మీ సరిహద్దుల్లో యాంటీ-డ్రోన్ సిస్టమ్స్‌ను, లేజర్ వెపన్స్‌ను మోహరిస్తూ హైఅలర్ట్ ప్రకటించింది. ఈ డ్రోన్ వార్ఫేర్ ఎంతో ప్రమాదకరమైనది, దీనిని ఎదుర్కోవడానికి ఇండియన్ ఆర్మీ కూడా తన డిఫెన్స్ టెక్నాలజీని అంతే వేగంగా అప్‌గ్రేడ్ చేస్తోంది.



