పెళ్లికి ముందే బ్రేకప్..కాజల్ లవ్ స్టోరీలో ఊహించని ట్విస్ట్!

దక్షిణాదిన ఒక దశాబ్దానికి పైగా అగ్రతారగా వెలుగొందిన నటి కాజల్ అగర్వాల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. రీసెంట్ గా ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో కాజల్ తన మనసులోని మాటలను ఎలాంటి దాపరికాలు లేకుండా పంచుకుంది. గౌతమ్ కిచ్లూ, తాను మొదటి నుంచి స్నేహితులమని సుమారు 13 ఏళ్ల క్రితం ఒక స్నేహితుడి పెళ్లిలో ఉమ్మడి స్నేహితుల ద్వారా వీరు మొదటిసారి కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్తా నెమ్మదిగా స్నేహంగా మారి, ఆ తర్వాత ప్రేమకు దారితీసింది. అలా కొంతకాలం పాటు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా డేటింగ్ చేశారు. కానీ, అన్ని ప్రేమకథల్లో లాగే వీరి మధ్య కూడా మనస్పర్థలు వచ్చాయి. ఇద్దరి ఆలోచనలు కలవకపోవడంతో ఒకానొక దశలో బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. అయితే ప్రేమికులుగా విడిపోయినప్పటికీ, వాళ్లిద్దరూ మంచి స్నేహితులుగా మాత్రం కంటిన్యూ అయ్యారు. ఆ బ్రేకప్ సమయంలో ఇద్దరూ ఎవరికి వారే వేర్వేరు వ్యక్తులతో డేటింగ్ చేసినట్లు కాజల్ స్వయంగా వెల్లడించింది. విడిపోయిన తర్వాత కూడా, ఒకరి జీవితంలో మరొకరు ముఖ్యమైన వ్యక్తులుగానే ఉన్నామని, తమ మధ్య ఉన్న ఆ బంధం ఏంటో అప్పటికి తమకు కూడా అర్థం కాలేదని కాజల్ చెప్పుకొచ్చింది.
బ్రేకప్ తర్వాత ఇద్దరూ ఎవరి లైఫ్లో వారు బిజీ అయిపోయారు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఈ జంట తమ ప్రేమ గురించి మరోసారి ఆలోచించుకునే అవకాశం దొరికింది. కరోనాకు ముందు వరకు వృత్తిపరమైన బాధ్యతలతో బిజీగా ఉండటం వల్ల పర్సనల్ లైఫ్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే లాక్డౌన్ విధించారో, పరిస్థితులు మారిపోయాయి. కొన్ని వారాల పాటు ఇద్దరూ కలుసుకోలేకపోయేసరికి.. ఒకరికొకరు ఎంత మిస్ అవుతున్నారో వారికి అర్థమైంది. ఒకరితో ఒకరు కలిసి ఉండాలనే కోరిక వాళ్ల మనసులో ఎంత బలంగా ఉందో ఆ దూరమే వాళ్లకు నేర్పించింది. దీంతో తమ బంధం విలువ తెలుసుకున్న కాజల్, గౌతమ్.. మళ్లీ పాత మనస్పర్థలన్నీ పక్కనపెట్టి ఒక్కటవ్వాలని మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నారు. అలా 2020 జూన్ నెలలో వీరిద్దరి నిశ్చితార్థం అత్యంత ఆత్మీయుల మధ్య సింపుల్గా జరిగిపోయింది. 2020 అక్టోబర్ 30న ముంబైలోని ఒక ప్రైవేట్ స్టార్ హోటల్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే కరోనా ఆంక్షల సమయంలో పెళ్లి జరగడంతో.. తమ పెళ్లి వేడుకను కేవలం కొద్దిమంది కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో మాత్రమే నిరాడంబరంగా నిర్వహించుకున్నామని కాజల్ తెలిపింది. పెళ్లైన కొంతకాలానికే ఈ జంట తమ జీవితంలో మరో అందమైన కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. 2022 జనవరిలో తాను గర్భం దాల్చిన విషయాన్ని కాజల్ అభిమానులతో పంచుకుంది. అదే ఏడాది ఏప్రిల్ 19న ఈ దంపతులు ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఒకవైపు బాధ్యత గల భార్యగా, తల్లిగా మరోవైపు తనకిష్టమైన నటనను కూడా అద్భుతంగా బ్యాలెన్స్ చేసుకుంటోంది. ఇటీవల పలు బడా ప్రాజెక్టుల్లో భాగమైన కాజల్.. తాజా ఇంటర్వ్యూలో ఒక విషయం ప్రస్తావిస్తూ, పౌరాణిక చిత్రం రామాయణలో రావణుడి భార్య మండోదరి పాత్రలో కనిపించడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపింది.



