మహేశ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. ఊహించని అప్డేట్ ఇచ్చిన వారణాసి టీమ్ ..!

మరోసారి భారతీయ సినిమా ప్రపంచానికి తన సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. అత్యంత భారీ బడ్జెట్ తో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వారణాసి. సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోంది. గతేడాది నవంబర్ 15న ఈ సినిమా టైటిల్, మహేశ్ బాబు ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు. ఆ గ్లింప్స్ వచ్చి కరెక్ట్‌గా సంవత్సరం పూర్తయింది. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అప్డేట్స్ కోసం నానా హంగామా చేశారు. ఏడాది పూర్తయిన సందర్భంగా కనీసం ఒక చిన్న అప్డేట్ అయినా ఇవ్వండి అంటూ ట్విట్టర్ వేదికగా పోస్టుల వర్షం కురిపించారు. ఎట్టకేలకు అభిమానుల ఆత్రుతను గమనించిన వారణాసి మేకర్స్.. అందరికీ అదిరిపోయే, దిమ్మతిరిగే ఒక మాస్ అప్డేట్ ఇచ్చారు. ఫ్యాన్స్ అడిగింది చిన్న అప్డేటే అయినా, రాజమౌళి టీమ్ మాత్రం ఒకేసారి డబుల్ ట్రీట్ ఇచ్చింది. వారణాసి సినిమా గ్లింప్స్ వచ్చి ఏడాదైన సందర్భంగా.. ట్విట్టర్ వేదికగా ఓ అభిమాని అప్డేట్ ఇవ్వాలంటూ మేకర్స్‌ను ట్యాగ్ చేశాడు. ఈసారి మేకర్స్ వెంటనే స్పందిస్తూ.. ఏకంగా సినిమా ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను మొత్తం బయటపెట్టేశారు. సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీజీఐ , రీ రికార్డింగ్ పనులు కంటిన్యూ అవుతున్నాయి. త్వరలోనే డబ్బింగ్ కూడా మొదలు పెట్టాలి. ప్రస్తుతానికి ఇదే అప్డేట్ అనుకోండి. లేదంటే అసలైన బ్లాస్ట్ కోసం ఎదురుచూడండి అంటూ మేకర్స్ రిప్లై ఇచ్చారు. ఈ ఒక్క ట్వీట్‌తో సోషల్ మీడియాలో మహేశ్ బాబు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిందని, ఇక విజువల్ ఎఫెక్ట్స్ , డబ్బింగ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలియడంతో సినిమా కచ్చితంగా ఆన్-టైమ్‌కి వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు కూడా ఫిక్స్ అయిపోయాయి. ఇక మేకర్స్ చెప్పిన ఆ అసలైన బ్లాస్ట్.. ట్రైలర్ రూపంలో ఉంటుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఇక మన తెలుగు సినిమాలు సాధారణంగా 5 భాషల్లో వస్తేనే పాన్ ఇండియా అంటాం. కానీ వారణాసి సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో ఏకంగా 50 భాషల్లో డబ్బింగ్ చేస్తున్నారు. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 120 దేశాల్లో ఈ చిత్రాన్ని ఒకేసారి భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒక ఇండియన్ సినిమా, అందులోనూ మన తెలుగు సినిమా ఇన్ని దేశాల్లో, ఇన్ని భాషల్లో ఏకకాలంలో విడుదల కావడం అనేది ఇండియన్ సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డ్. ఆఫ్రికా, యూరప్, లాటిన్ అమెరికా దేశాల్లోని స్థానిక భాషల్లో సైతం మహేశ్ బాబు డైలాగులు పేలనున్నాయి. మహేశ్ బాబు రుద్ర పాత్రలో కనిపించనుండగా..ప్రియాంకా చోప్రా మందాకిని అనే అత్యంత కీలకమైన, యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రలో నటిస్తోంది. మరో పవర్ఫుల్ క్యారెక్టర్ లో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కేవలం పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని మేకర్స్ చెప్పిన విధానం చూస్తుంటే.. ముందుగా అనుకున్నట్లుగానే 2027 ఏప్రిల్ 7న బాక్సాఫీస్ బరిలో వారణాసి దిగడం లాంఛనమే అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మేకర్స్ చెప్పిన ఆ అసలైన బ్లాస్ట్ ఎప్పుడు పేలుతుందా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహేశ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులంతా ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 120 దేశాల్లో 50 భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం ఏ స్థాయి కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందో, ఏయే హాలీవుడ్ రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.



