ఎల్నినో నేపథ్యంలో రైతులకు ఊరట..ఖరీఫ్ కోసం కేంద్రం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక

మన దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రంగాలలో ఒకటి వ్యవసాయం. అయితే వచ్చే ఏడాది ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా దేశంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉందన్న వాతావరణ అంచనాలు ఇప్పుడు అన్నదాతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టి నష్టాన్ని పూర్తిగా నివారించడంపై కేంద్రం దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగును, కోట్లాది మంది అన్నదాతల ఆదాయాన్ని కాపాడేందుకు ఒక భారీ మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేసింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎల్ నినో ప్రభావంపై ప్రత్యేక పర్యవేక్షణ అత్యంత శాస్త్రీయంగా కొనసాగుతోంది. ఏ జిల్లాకు ఎంత ముప్పు ఉందో అంచనా వేయడానికి అధికారులు కేవలం పాత లెక్కలపైనే ఆధారపడలేదు. ఆయా ప్రాంతాల్లోని వర్షపాత అంచనాలు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిపారుదల వసతులు, మొత్తం సాగు విస్తీర్ణం వంటి సమగ్ర సైంటిఫిక్ డేటాను లోతుగా విశ్లేషించారు. ఆ విశ్లేషణ ఆధారంగానే దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే అధిక ముప్పు ఉన్న 262 జిల్లాలను ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఈ జిల్లాల్లోని క్షేత్రస్థాయి పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం , ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సమన్వయంతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. ఎక్కడైనా వర్షం లోటు కనిపించినా, భూగర్భ జలాలు తగ్గినా తక్షణమే స్పందించి రైతులకు అండగా నిలిచేలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
వర్షాలు ఆలస్యమైనప్పుడు లేదా మొదట వేసిన విత్తనాలు మొలకెత్తక ఎండిపోయినప్పుడు రైతులు మళ్లీ విత్తనాలు దొరక్క ఇబ్బందిపడుతుంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వర్షాలు ఆలస్యమైనా లేదా సాధారణం కంటే తక్కువగా కురిసినా రైతులు ఏమాత్రం ఆందోళన చెందకుండా అదనపు ఖరీఫ్ విత్తనాలను ముందస్తుగానే సిద్ధం చేసి ఉంచాలని నిర్ణయించింది. విత్తనాల నిల్వ మాత్రమే కాకుండా.. జిల్లా స్థాయిలో రూపొందించిన వ్యవసాయ అత్యవసర ప్రణాళికలపై రైతులకు సీజన్ కంటే ముందుగానే పూర్తిస్థాయి అవగాహన కల్పించనుంది. ఆయా జిల్లాల్లోని వర్షపాత పరిస్థితులకు అనుగుణంగా..ఏ పంటలు వేస్తే తక్కువ నీటితో మంచి దిగుబడి వస్తుంది. పంటల ఎంపికలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి. విత్తనాలు వేసే సమయాన్ని ఎలా మార్చుకోవాలి. అనే కీలక అంశాలపై వ్యవసాయ నిపుణులు రైతులకు నేరుగా క్షేత్రస్థాయిలో తగిన సూచనలు అందించనున్నారు. దీనివల్ల తప్పుడు సమయాల్లో విత్తనాలు వేసి రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం భారీగా తగ్గుతుంది.
ఎల్నినో ప్రభావం కారణంగా నీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మైక్రో ఇరిగేషన్ పద్ధతుల వినియోగాన్ని దేశవ్యాప్తంగా భారీగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. సాధారణంగా డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలు కొనుగోలు చేయాలంటే చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి భారంగా మారుతుంది. అందుకే ఆ భారాన్ని తగ్గించేందుకు డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలపై రాయితీలను మరింత పెంచాలని కేంద్రం యోచిస్తోంది. కేవలం పరికరాలు ఇచ్చి చేతులు దులుపుకోకుండా, అందుబాటులో ఉన్న తక్కువ నీటిని అత్యంత పొదుపుగా ఎలా వాడుకోవాలో రైతులకు ప్రత్యేక శిక్షణ, అవగాహన కార్యక్రమాలను కూడా కేంద్రం నిర్వహించనుంది.
పంట సాగుకు ఎంత జాగ్రత్త తీసుకున్నా, ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ ప్రతికూలతల వల్ల రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు కేంద్రం ఆర్థిక రక్షణ కవచాన్ని మరింత బలోపేతం చేస్తోంది. గుర్తించిన 262 జిల్లాల్లో పంటల బీమా , వ్యవసాయ రుణాల పరిధిని మరింత విస్తరించనుంది. అలాగే వాతావరణ హెచ్చరికలకు అనుగుణంగా విత్తనాల లభ్యత, ఎరువుల సరఫరా , నీటి నిర్వహణను ఒకే తాటిపైకి తెచ్చి అనుసంధానించడం వలన ఖరీఫ్ సాగులో ఎక్కడా ఎరువుల కొరత కానీ, విత్తనాల ఆలస్యం కానీ లేకుండా సాఫీగా సాగేలా కేంద్రం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. కేంద్రం రూపొందించిన ఈ ముందస్తు ప్రణాళిక క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సక్రమంగా అమలైతే.. లక్షలాది మంది అన్నదాతలతో పాటు ప్రజల దేశ ఆహార భద్రతకు కూడా బలమైన భరోసా లభిస్తుంది.



