ఆదర్శంగా నిలుస్తున్న ఖిలా వరంగల్ రైతులు.. ఆకుకూరలు, కూరగాయల సాగుతో లాభాల బాట

సంప్రదాయ పంటలకు భిన్నంగా కూరగాయలు, ఆకుకూరల సాగును ఎంచుకుంటూ కొంతమంది రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. ముఖ్యంగా ఆకుకూరల సాగు ఇప్పుడు రైతులకు ఉపాధి మార్గంగా మారుతోంది. వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ రైతులు తోటకూర, పాలకూర, గోంగూర, మెంతికూర, కొత్తిమీర వంటి ఆకుకూరలను సాగు చేస్తూ ఆదాయం పొందుతున్నారు. వ్యవసాయంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఖిలా వరంగల్ రైతులు తమ సాగు విధానాలను మార్చుకుంటున్నారు. ఒకప్పుడు వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలకే పరిమితమైన రైతులు.. ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ఖిలా వరంగల్ రైతులు ఆకుకూరల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. తోటకూర, పాలకూర, గోంగూర, మెంతికూర, కొత్తిమీర వంటి పంటలను సాగు చేస్తున్నారు. ఆకుకూరలకు మార్కెట్లో ప్రతిరోజూ డిమాండ్ ఉండటంతో రైతులకు నిరంతర ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల ఆకుకూరలు తక్కువ వ్యవధిలోనే కోతకు వస్తాయి. ఒకే భూమిలో వరుసగా పంటలు సాగు చేసుకునే అవకాశం ఉండడంతో రైతులు ఆకుకూరల సాగుకు మొగ్గు చూపుతున్నారు.
ఒకే రకమైన పంటపై ఆధారపడకుండా సుమారు రెండు వందల మంది రైతులు వివిధ రకాల ఆకుకూరలను సాగు చేస్తున్నారు. తోటకూర, పాలకూర, గోంగూర, మెంతికూర, కొత్తిమీర, చుక్కకూర ఇలా రకరకాల ఆకుకూరలను పండిస్తున్నారు.మార్కెట్లో ఏ ఆకుకూరకు ఎక్కువ డిమాండ్ ఉంది? ఏ సీజన్లో ఏ పంట వేస్తే అనుకూలంగా ఉంటుంది? అనే అంశాలను పరిశీలిస్తూ సాగు చేస్తున్నారు. ముఖ్యంగా వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పంటల ఎంపిక చేసుకుంటున్నారు. ఒక పంట కోతకు వచ్చిన సమయంలో మరో పంట సిద్ధంగా ఉండేలా ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. దీంతో ఒకేసారి పంట మొత్తం అమ్ముడుపోకపోయినా.. విడతలవారీగా దిగుబడిని మార్కెట్కు తరలించే అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు...ఆకుకూరల సాగులో ఈ రైతులకు ప్రధానంగా కలిసొస్తున్న అంశం మార్కెట్లో ఉండే నిరంతర డిమాండ్. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు భాగం కావడంతో పట్టణాలు, గ్రామాల్లో వీటికి కొనుగోలుదారులు ఉంటున్నారు. పంటను కోసిన వెంటనే ప్రతి రోజు మార్కెట్లో విక్రయిస్తున్నామని అంటున్నారు.



