ఆ వైఖరిలో మార్పు లేదు…సింధు జలాలపై తన స్టాండ్ మరోసారి స్పష్టం చేసిన భారత్

భారత్-పాకిస్థాన్ దౌత్య సంబంధాల్లో అత్యంత కీలకమైన పరిణామం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా చోటుచేసుకుంది. గత ఏడాది జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత చోటుచేసుకున్న ఆపరేషన్ సిందూర్ సైనిక ఉద్రిక్తతల తర్వాత.. మొట్టమొదటిసారిగా ఒక పాకిస్థాన్ మంత్రి అధికారిక కార్యక్రమం కోసం ఢిల్లీకి వచ్చారు. షాంఘై సహకార సంస్థ సివిలైజేషన్ డైలాగ్ వేదికలో పాకిస్థాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ పాల్గొన్నారు. అయితే, పాక్ మంత్రి భారత్ గడ్డపై అడుగుపెట్టిన సరిగ్గా ఇదే సమయంలో.. భారత్-పాకిస్థాన్ మధ్య అత్యంత కీలకమైన సింధు జలాల ఒప్పందం విషయంలో భారత విదేశాంగ శాఖ ఒక స్పష్టమైన, కీలక ప్రకటన చేసింది. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ శాఖ తేల్చిచెప్పేసింది.తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్‌కు దీనిపై మీడియా ప్రతినిధుల నుంచి ప్రశ్న ఎదురైంది. పాకిస్థాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ భారత్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో సింధు జలాల ఒప్పందంపై భారత్ వైఖరి ఏమిటని జర్నలిస్టులు ప్రశ్నించగా..దీనిపై భారత్ తన వైఖరిని ఇప్పటికే స్పష్టంగా ప్రకటించిందని, అందులో ఎలాంటి మార్పు లేదని ఆయన తేల్చిచెప్పారు. భారత వైఖరి ఇప్పటికీ అదే విధంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్లో జరిగిన ఘోర ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై తీసుకున్న కఠిన చర్యల్లో భాగంగానే భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ ఒప్పందం విషయంలో భారత్ తన కఠిన వైఖరిని కొనసాగిస్తోంది. తాజాగా పాక్ మంత్రి ఢిల్లీలో ఉన్నప్పటికీ, కేంద్రం తన నిర్ణయంలో మార్పు లేదని తేల్చి చెప్పడం దౌత్య వర్గాల్లో తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదే క్రమంలో సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడిన పాకిస్థాన్ మంత్రి ముసాదిక్ మాలిక్‌కు భారత జర్నలిస్టుల నుంచి కఠినమైన ప్రశ్న ఎదురైంది. సరిహద్దు ఉగ్రవాదంపై భారత్ వ్యక్తం చేస్తున్న తీవ్ర ఆందోళనల గురించి మీడియా ప్రతినిధులు ఆయన్ను ప్రశ్నించగా..ఆయన దానిని దాటవేశారు. మరుసటి రోజు తాను అధికారిక ప్రకటన చేసిన తర్వాత ఈ అంశంపై మరింత చర్చించవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ప్రాంతీయ దేశాల మధ్య సంభాషణలు జరగడం ఎంతో ముఖ్యమని, ఇలాంటి వేదికలు స్వాగతించదగినవని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో భారత్-పాకిస్థాన్ సంబంధాలు మెరుగుపడే అవకాశాలపై కూడా మాలిక్ ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రాంతీయ దేశాల మధ్య సంబంధాలు సానుకూల దిశగా ముందుకు సాగాలని ఆశిస్తున్నాము అని పాక్ మంత్రి తెలిపారు. మారుతున్న అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల్లో కేవలం ద్వైపాక్షిక విభేదాలకే పరిమితం కాకుండా, ప్రాంతీయ సమస్యలపై విస్తృత దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ, సామాజిక సవాళ్లను పరిష్కరించేందుకు పరస్పర చర్చలు, సంప్రదింపులు పెరగాలన్నారు. వివిధ దేశాలు, నాగరికతలు, భిన్న అభిప్రాయాలు ఒకే వేదికపైకి వచ్చినప్పుడే అర్థవంతమైన సంభాషణ సాధ్యమవుతుందని తెలిపారు. ఇక భారత్ ఒకవైపు ఎస్సీఓ వంటి బహుళపక్ష ప్రాంతీయ వేదికకు ఆతిథ్యం ఇస్తూ, అన్ని సభ్య దేశాలతో పాటు పాకిస్థాన్ మంత్రిని కూడా ఆహ్వానించి తన అంతర్జాతీయ బాధ్యతను చాటుకుంది. అదే సమయంలో పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో నిలిపివేసిన సింధు జలాల ఒప్పందంపై తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని విదేశాంగ శాఖ ద్వారా ప్రపంచానికి గట్టి సంకేతం పంపింది. ప్రాంతీయ సహకారం వేరు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ధోరణిపై కఠిన చర్యలు వేరు అన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి రుజువు చేసింది.



