ఒకేరోజు రెండు భారీ సినిమాలు..సల్మాన్ ఖాన్ హుందాతనం.. శ్రద్ధా కపూర్ పాజిటివ్ రిప్లై

సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ క్లాష్ వస్తే హీరోలు, నిర్మాతల మధ్య మాటల యుద్ధం, వివాదాలు నడుస్తుంటాయి. కానీ, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ తన హుందాతనాన్ని చాటుకుని అందరి మనసులు గెలుచుకున్నారు. ఎన్నో వాయిదాల తర్వాత సల్మాన్ ఖాన్ నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్ ఎట్టకేలకు డిసెంబర్ 4న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. అయితే, సరిగ్గా అదే డిసెంబర్ 4న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటించిన ఈథా సినిమా కూడా విడుదలవుతోంది.
ఈ అనుకోని బాక్సాఫీస్ పోటీపై స్పందించిన సల్మాన్ ఖాన్.. ఏకంగా శ్రద్ధా కపూర్‌కు స్వయంగా ఫోన్ చేసి క్షమాపణలు చెప్పడం సంచలనంగా మారింది. రీసెంట్ గా జరిగిన ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ తన సినిమా విడుదల తేదీని ఖరారు చేయడంలో ఎదురైన ఇబ్బందులన్నింటినీ ఎంతో ఓపెన్‌గా పంచుకున్నారు. నిజానికి మాతృభూమి సినిమా డిసెంబర్ 4న రావాల్సింది కాదని, అంతకుముందే రెండు తేదీలను అనుకున్నామని ఆయన వివరించారు. మొదట నవంబర్ 20న సినిమాను విడుదల చేయాలని భావించారు. కానీ, వీఎఫ్ఎక్స్ పనుల్లో కొన్ని లోపాలు గుర్తించడంతో, నాణ్యత విషయంలో రాజీ పడకుండా సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నవంబర్ 27న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, సరిగ్గా అదే రోజు తనకు ఎన్నో మరపురాని విజయాలు అందించిన దర్శకుడు సూరజ్ బర్జాత్యా సినిమా ‘యే ప్రేమ్ మోల్ లియా’ విడుదలవుతుండటంతో సల్మాన్ వెనక్కి తగ్గారు. సూరజ్‌తో నేను ఎప్పటికీ బాక్సాఫీస్ పోటీకి దిగను అని ఆయన స్పష్టం చేశారు. అలాగే సన్నీ డియోల్ సినిమా విడుదల కూడా ఉండటంతో, ఆయనతోనూ పోటీ పడకూడదని సల్మాన్ నిర్ణయించుకున్నారు.ఇక క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న షారుఖ్ ఖాన్, సుహానా నటిస్తున్న కింగ్ విడుదల కానుంది. దీనిపై సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షారుఖ్‌తో నేను ఎప్పటికీ పోటీకి దిగను. అంతర్జాతీయ చిత్రాలైన అవెంజర్స్: డూమ్స్‌డే, డ్యూన్ వంటి భారీ సినిమాలతో పోటీ ఉన్నా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ.. షారుఖ్ ఖాన్‌తో మాత్రం బాక్సాఫీస్ క్లాష్ ఉండకూడదు అని సల్మాన్ తన స్నేహాన్ని చాటుకున్నారు.
ఇలా సూరజ్ బర్జాత్యా, సన్నీ డియోల్, షారుఖ్ ఖాన్ సినిమాలన్నింటినీ తప్పించుకుంటూ చివరికి డిసెంబర్ 4వ తేదీని ఎంచుకున్నారు సల్మాన్. అయితే, అదే రోజు శ్రద్ధా కపూర్ నటించిన ఈథా సినిమా కూడా విడుదలవుతోందన్న విషయం తనకు ముందుగా తెలియదని సల్మాన్ విచారం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే సల్మాన్ ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ఈ విషయం నాకు ముందుగా తెలియదు. ముందే తెలిసి ఉంటే శ్రద్ధా సినిమాతో పోటీకి వచ్చేవాడిని కాదు. శ్రద్ధా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. అందుకే ఇప్పటికే శ్రద్ధాకు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పాను. ఈ విషయం నాకు తెలియదు, నిజంగా క్షమించు అని ఆమెతో అన్నాను అంటూ సల్మాన్ వెల్లడించారు. అయితే, సల్మాన్ ఫోన్ చేసినప్పుడు శ్రద్ధా కపూర్ ఇచ్చిన సమాధానం ఆయన మనసును గెలుచుకుంది. రెండు సినిమాలూ విడుదల కావడానికి తగినంత స్థలం ఉంది సర్ అని శ్రద్ధా ఎంతో పాజిటివ్‌గా, గౌరవంగా బదులిచ్చారట. ఆ మాట విని తాను ఎంతో సంతోషించానని చెప్పిన సల్మాన్, ప్రేక్షకులందరూ తన సినిమాతో పాటు శ్రద్ధా కపూర్ సినిమాను కూడా కచ్చితంగా థియేటర్లలో చూడాలని కోరారు. సల్మాన్ ఖాన్ చూపించిన ఈ హుందాతనం, శ్రద్ధా కపూర్ ఇచ్చిన పాజిటివ్ రిప్లై, అలాగే సూరజ్ బర్జాత్యా, సన్నీ డియోల్, షారుఖ్ ఖాన్‌లపై సల్మాన్ చూపిన గౌరవం ఇప్పుడు బాలీవుడ్ అభిమానులందరినీ ఆకట్టుకుంటోంది.



