ఒకవైపు దుర్భర పరిస్థితులు…మరొక వైపు అంతరిక్ష కలలు..పాక్ చూపు అటువైపు

భారత్ అనేక రంగాల్లో స్వావలంబన దిశగా దూసుకుపోతోంది. అగ్రరాజ్యాలను సైతం వెనుకకు నెడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలలో గణనీయమైన ప్రగతి సాధిస్తోంది. గత కొన్నేళ్లుగా అంతరిక్ష రంగంలో అయితే భారత్ స్పీడ్ రాకెట్ మాదిరి దూసుకుపోతున్న తీరును అభివృద్ధి చెందిన దేశాలు కూడా నోరెళ్ల బెట్టి చూస్తున్నాయి. కాగా, అంతరిక్ష సంస్థ ఇస్రో సాధిస్తున్న అద్భుత విజయాలను చూసి దశాబ్దాలుగా దాయాది పాకిస్థాన్ కుళ్లుకుంటూనే ఉంది. ఒకవైపు దేశంలో దుర్భర పరిస్థితులతో అక్కడి సామాన్య పౌరులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక సాయం కోసం పాక్ ప్రపంచ దేశాల వైపు చూస్తూనే ఉంది. ఇప్పుడు అంతరిక్ష కలలు కంటోంది. తమ సొంత పరిజ్ఞానంతో రాకెట్లు పంపే సత్తా లేకపోవడంతో, ఆసియాలో ఇండియాకు బద్ధ శత్రువైన చైనా పంచన చేరింది పాకిస్థాన్. చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ తాజాగా ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది షెన్‌జౌ-24 స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా ఒక పాకిస్థాన్ వ్యోమగామి భూకక్ష్యలోని చైనా అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నాడు. అక్కడ కొంతకాలం ఉండి, ఆ తర్వాత పాత షెన్‌జౌ-23 క్యాప్సూల్ ద్వారా తిరిగి భూమికి చేరుకుంటాడు. దీనికోసం పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు అభ్యర్థులు, ముహమ్మద్ జీషాన్ అలీ , ఖుర్రం దావూద్ బీజింగ్‌లోని చైనా ఆస్ట్రోనాట్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్లో కఠినమైన శిక్షణ తీసుకున్నారు. చైనా వ్యోమగాములతో కలిసి ఆపరేషనల్ ట్రైనింగ్ తీసుకోవడమే కాకుండా, కమ్యూనికేషన్ కోసం ప్రత్యేకంగా చైనీస్ భాషను కూడా వీరు నేర్చుకున్నారు. ఈ ఇద్దరిలో ఒకరిని ఫైనల్ చేసి పేలోడ్ స్పెషలిస్ట్ గా అంతరిక్షంలోకి పంపనున్నారు. చైనా మ్యాన్డ్ స్పేస్ ప్రోగ్రామ్ చరిత్రలో, ఒక విదేశీయుడిని తమ స్పేస్ స్టేషన్ కు తీసుకెళ్లడం ఇదే తొలిసారి. 2025 ఫిబ్రవరిలో చైనా-పాక్ మధ్య కుదిరిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంతరిక్ష ఒప్పందంలో భాగంగానే ఈ మిషన్ జరుగుతోంది.
చైనాకి పాకిస్థాన్ మీద ఉన్నది ప్రేమ కాదు, కేవలం రాజకీయ వ్యూహం మాత్రమే. ఆసియా ఖండంలో ఇప్పుడు అంతరిక్ష రంగాన్ని శాసిస్తున్నది ఇస్రో మాత్రమే. తక్కువ బడ్జెట్ తో అంగారకుడి మీదకు, చంద్రుడి దక్షిణ ధృవం మీదకు వెళ్లిన ఇస్రో దెబ్బకు చైనాకు కూడా భయం పట్టుకుంది. ప్రస్తుతం భారత్ 2027 నాటికి గగన్‌యాన్ మిషన్ ద్వారా సొంతంగా మనుషులను అంతరిక్షంలోకి పంపేందుకు రెడీ అవుతోంది. అలాగే 2035 నాటికి సొంత స్పేస్ స్టేషన్ నిర్మించాలని, 2040 నాటికి చంద్రుడి మీదకు భారతీయుడిని పంపాలని టార్గెట్ పెట్టుకుంది. సరిగ్గా ఇండియా ఈ మైల్ స్టోన్స్ రీచ్ అయ్యేలోపే, ఎలాగైనా సరే ఇస్రో కంటే ముందు పాకిస్థాన్ ను వాడుకుని సౌత్ ఆసియాలో ఒక సైకలాజికల్ గేమ్ ఆడాలని చైనా భావిస్తోంది. పాకిస్థాన్ ను అంతరిక్షంలోకి పంపడం ద్వారా, ప్రపంచ వేదికపై తమ స్పేస్ స్టేషన్ కు ఉన్న డిమాండ్ ను, తమ మిత్ర దేశాలకు తాము ఇచ్చే సపోర్ట్ ను అమెరికాకు, ఇండియాకు చూపించాలన్నదే జిన్‌పింగ్ అసలు ప్లాన్.
కేవలం స్పేస్ స్టేషన్ కు వెళ్లడమే కాదు, పాకిస్థాన్ అంతరిక్ష కలలు చాలా పెద్దవే ఉన్నాయి. ఇటీవల పాక్ ప్లానింగ్ మినిస్టర్ అహ్సాన్ ఇక్బాల్ మాట్లాడుతూ.. 2035 నాటికి పాకిస్థాన్ చంద్రుడి మీద కాలు మోపాలని లక్ష్యంగా పెట్టుకుందని ప్రకటించారు. అయితే సొంతంగా రాకెట్ సైన్స్ లేని పాకిస్థాన్ కు ఇది ఎలా సాధ్యం? ఇక్కడే చైనా చాంగే-8 లూనార్ మిషన్ తెరపైకి వస్తుంది. 2028లో చైనా ప్రయోగించబోయే ఈ మిషన్ లో పాకిస్థాన్ తయారు చేసిన ఒక లూనార్ రోవర్ ను కూడా చంద్రుడి మీదకు పంపుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే ఈ స్మార్ట్ రోవర్, చంద్రుడి ఉపరితలంపై అడ్డంకులను గుర్తించి ఆటోమేటిక్ గా నావిగేట్ అవుతుంది. అయితే చంద్రుడిపైకి మనిషిని పంపే విషయంలో మాత్రం చైనా నుంచి పాకిస్థాన్ కు ఎలాంటి అఫీషియల్ కమిట్మెంట్ రాలేదని రాయిటర్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు చైనా 2030 నాటికి తమ స్వదేశీ వ్యోమగాములను చంద్రుడిపైకి పంపాలని చూస్తుంటే, అమెరికా మాత్రం 2028 నాటికే మళ్లీ చంద్రుడిపై మనుషులను దించాలని స్పేస్ రేస్ లో దూసుకుపోతోంది. ఒక దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందడం చాలా మంచి పరిణామం. కానీ ఆ దేశ పౌరులు కనీస అవసరాలైన కనీస అవసరాల కోసం ఇబ్బందులు పడుతుంటే వేల కోట్లు ఖర్చు పెట్టి చైనా రాకెట్లలో అంతరిక్షానికి వెళ్లడం పాకిస్థాన్ కే చెల్లింది. చైనా సాయంతో పాక్ అంతరిక్షంలో అడుగుపెట్టినా.. సొంత పరిజ్ఞానం, స్వదేశీ రాకెట్ సిస్టమ్ ఉన్న భారతదేశపు ఇస్రో దరిదాపుల్లోకి కూడా పాక్ ఎప్పటికీ రాలేదు అన్నది వాస్తవం.



