చివరి శ్వాస వరకు పాటతోనే…కంటతడి పెట్టిస్తున్న 17 ఏళ్ల కుర్రాడి చివరి వీడియో

మరణం ముంగిట నిలబడి, చావును నవ్వుతూ ఆహ్వానిస్తూ.. ఒక 17 ఏళ్ల కుర్రాడు తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పాడిన ఒకే ఒక్క పాట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను కలచివేస్తోంది. అతని పేరు రిషబ్ దత్తా. సొంత ఊరు అస్సాం. చిన్నప్పటి నుంచి సంగీతం అంటే విపరీతమైన ప్రాణం రిషబ్‌కు. అతని చేతికి గిటార్ వస్తే చాలు, పరిసరాలను మర్చిపోయి అద్భుతమైన పాటలు పాడేవాడు. ఆ వయసులో అందరిలాగే కాలేజీ, స్నేహితులు, భవిష్యత్తులో గొప్ప సింగర్ కావాలంటూ ఎన్నో కలలు కన్నాడు. కానీ, విధి ఆ కుర్రాడి పట్ల చాలా క్రూరంగా వ్యవహరించింది. అనుకోకుండా వచ్చిన ఒక తీవ్రమైన రక్త సంబంధిత వ్యాధి అయిన అప్లాస్టిక్ అనీమియా ఆ పిల్లాడి కలలను తుంచేసింది. వ్యాధి తీవ్రత పెరగడంతో బెంగళూరులోని ఒక పెద్ద ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలోని నర్సులు, డాక్టర్లు అతడిని కాపాడటానికి శతవిధాలా ప్రయత్నించారు. కానీ లాభం లేకపోయింది. రిషబ్ కు కూడా ఆ విషయం తెలుసు, కానీ అతని ముఖంలో ఎప్పుడూ భయం కనిపించలేదు. ఆ నొప్పితో విలవిలలాడుతూ కూడా, తనను చూసుకుంటున్న నర్సుల కోసం, డాక్టర్ల కోసం చిన్న చిన్న పాటలు పాడుతూ వాళ్లకు ధైర్యం చెప్పేవాడు. ఆ ఆసుపత్రి వార్డులో రిషబ్ అందరికీ ఒక ఆత్మీయుడిగా మారిపోయాడు.
క్రమంగా రిషబ్ పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ముక్కుకు ఆక్సిజన్ ట్యూబులు, చేతులకు సెలైన్ పైపులు ఉన్నాయి. ఏ క్షణమైనా ప్రాణాలు పోవచ్చని డాక్టర్లు కన్నీళ్లతో కుటుంబ సభ్యులకు చెప్పారు. సరిగ్గా ఆ సమయంలో రిషబ్ తన తల్లిదండ్రులను, డాక్టర్లను ఒక చివరి కోరిక అడిగాడు. దయచేసి నా చేతికి నా గిటార్ ఇవ్వండి.. నేను ఒక పాట పాడాలి అని అడిగాడు. ఆ పరిస్థితుల్లో గిటార్ మోయడం, పాట పాడటం అతనికి అసాధ్యం. కానీ ఆ ఆఖరి కోరికను కాదనలేక, నర్సులు వాడి చేతికి గిటార్ అందించారు.ఆ పరిస్థితుల్లో కూడా బాలీవుడ్ లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ పాడిన ఐకానిక్ సాంగ్ లగ్ జా గలే .లగ్ జా గలే కి ఫిర్ యే హసీన్ రాత్ హో నా హో..షాయద్ ఫిర్ ఇస్ జనమ్ మే ములాకాత్ హో నా హో… తన జీవితం ముగిసిపోతోందని, మళ్లీ ఈ అందమైన రాత్రి తన జీవితంలోకి రాదని, ఈ జన్మలో తన ఆత్మీయులను మళ్లీ కలవలేనని అతనికి తెలుసు. అందుకే ఈ ప్రపంచానికి ఒక అద్భుతమైన వీడ్కోలు పలకడానికి ఆ పాటను ఎంచుకున్నాడు. లతా మంగేష్కర్ పాడిన ఈ అద్భుతమైన పాట పూర్తి లిరిక్స్, దాని భావాన్ని మీరు గూగుల్ సెర్చ్‌లో వెతికి తెలుసుకోవచ్చు. ఆ మధురమైన, విషాదభరితమైన గొంతుతో రిషబ్ ఆ పాట పాడుతుంటే.. వాడికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు, అక్కడున్న మెడికల్ స్టాఫ్ అందరూ కన్నీళ్లు ఆపుకోలేక సైలెంట్ గా ఏడ్చేశారు.



