చైనా అద్భుత సృష్టి.. సింగిల్ ఛార్జింగ్‌తో 400 కిలోమీటర్లు

ప్రపంచం ఎలెక్ట్రిక్ వెహికల్స్ వైపు దూసుకుపోతోంది. అయితే భూమి మీద నడిచే వాహనాలకే కాదు. తాజాగా ప్రపంచ దేశాలకు షాకిస్తూ చైనాకు చెందిన CE-25ఏ అనే 10 టన్నుల పూర్తి ఎలక్ట్రిక్ కమర్షియల్ విమానం తన తొలి పైలటెడ్ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. చైనా ప్రభుత్వ విమానయాన సంస్థ కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ ఆఫ్ చైనా ఈ విమానాన్ని అభివృద్ధి చేసింది. ఎలక్ట్రిక్ విమానాల తయారీ ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే చైనా ఈ రేసులో ఒక అడుగు ముందుకు వేసింది. చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న బిన్జౌలో CE-25A ఎలక్ట్రిక్ విమానం తన మొట్టమొదటి మానవసహిత టెస్ట్ ఫ్లైట్‌ను జయప్రదం చేసుకుంది. ఈ చారిత్రక పరీక్షా సమయంలో విమానంలో ఇద్దరు అనుభవజ్ఞులైన పైలట్లు, ఒక ఫ్లైట్ టెస్ట్ ఇంజనీర్ ప్రయాణించారు. ఈ మొత్తం టెస్ట్ ఫ్లైట్ 57 నిమిషాల 46 సెకన్ల పాటు సాగింది. ఇందులో 16 నిమిషాల 38 సెకన్ల పాటు విమానం గాల్లోనే విహరించి, దాదాపు 60.4 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసింది. ప్రయాణం సమయంలో విమానం పనితీరు అద్భుతంగా ఉందని, తాము ఊహించిన అన్ని లక్ష్యాలను, భద్రతా ప్రమాణాలను ఈ విమానం చేరుకుందని కోమాక్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
CE-25A అనేది కోమాక్ సంస్థ తయారు చేసిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కమర్షియల్ విమానం. దీన్ని ప్రధానంగా రెండు పట్టణాల మధ్య షార్ట్ డిస్టెన్స్ ప్రయాణాల కోసం డిజైన్ చేశారు. ఈ విమానంలో ఒకేసారి 19 మంది ప్రయాణికులు కూర్చుని ప్రయాణించవచ్చు. ఈ ఎలక్ట్రిక్ విమానం గరిష్ట టేకాఫ్ బరువు 10 మెట్రిక్ టన్నులు. ఇది గంటకు 300 కిలోమీటర్ల క్రూజింగ్ వేగంతో ప్రయాణిస్తుంది. నేల నుంచి దాదాపు 2,400 మీటర్ల ఎత్తులో విహరించే ఈ విమానం.. బ్యాటరీ ఒకసారి ఫుల్ ఛార్జ్ అయితే 400 కిలోమీటర్ల దూరం నాన్‌స్టాప్‌గా ప్రయాణించగలదు. రెక్కలపై అమర్చిన డిస్ట్రిబ్యూటెడ్ ఎలక్ట్రిక్ డక్టెడ్-ఫ్యాన్ ప్రొపల్షన్ సిస్టమ్ ద్వారా ఈ విమానానికి శక్తి అందుతుంది. ఈ CE-25A ఎలక్ట్రిక్ విమానాన్ని కేవలం కోమాక్ మాత్రమే కాదు, చైనాకు చెందిన ప్రసిద్ధ బ్యాటరీ తయారీ సంస్థ సమకాలీన ఆంపెరెక్స్ టెక్నాలజీ కో లిమిటెడ్ , షాంఘై జియావో టోంగ్ యూనివర్సిటీ , ఇతర దేశీయ భాగస్వాములు కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశారు. దీని సెక్యూరిటీ తెలుసుకునేందుకు ఫిబ్రవరి 2వ తేదీన ఈ విమానాన్ని పైలట్లు లేకుండా కూడా గాల్లోకి పంపి టెస్ట్ చేశారు. ఆ తర్వాత ఏకంగా 19 సార్లు మానవరహిత అటానమస్ ఫ్లైట్ టెస్టులను విజయవంతంగా పూర్తి చేసి ఇప్పుడు పైలట్లతో ఫైనల్ టెస్ట్‌ను సక్సెస్ ఫుల్ గా చేశారు.



