టాలీవుడ్ లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్..హనుమాన్ 2 లో మెగా హీరో

టాలీవుడ్ లో ఇప్పుడు ఒకే ఒక్క వార్త ప్రకంపనలు సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన హనుమాన్ సినిమా సీక్వెల్ చుట్టూ అత్యంత ఆసక్తికరమైన, ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకే ఫ్రాంచైజీ నుంచి రెండు వేర్వేరు సినిమాలు తెరపైకి రాబోతున్నాయా? అసలు హనుమాన్ కథను ఎవరు కొనసాగించబోతున్నారు? అన్న ప్రశ్నలు ఇప్పటికే సినీ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తుండగా.. తాజాగా ఈ చర్చకు మరింత ఆజ్యం పోస్తూ మొదటి భాగాన్ని నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ ఒక సంచలన ప్రకటన చేసింది. దర్శకుడు ప్రశాంత్ వర్మకు గట్టి షాక్ ఇస్తూ, ప్రైమ్‌షో సంస్థ ఏకంగా హనుమాన్ 2 – ది రైజ్ ఆఫ్ వానరాస్ పేరుతో కొత్త సినిమాను ప్రకటించింది. అంతే కాదు ఈ ఫ్రాంచైజ్ లోకి మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఎంట్రీ ఇవ్వడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. విభిన్నమైన కథాంశాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వీఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఊరు పేరు భైరవకోన వంటి సూపర్ నాచురల్, ఫాంటసీ థ్రిల్లర్లతో ప్రేక్షకులను అలరించారు. ఇక ఈ సినిమా నుండి అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా విడుదలైంది. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ అధినేతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మించి, పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా స్టోరీ , ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్, షూటింగ్ షెడ్యూల్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
మొదటి భాగం హను-మాన్ కు దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ, ఇప్పటికే దానికి సీక్వెల్‌గా జై హనుమాన్ చిత్రాన్ని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి సాక్షాత్తు హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు. అయితే, ఈ సినిమాను ప్రైమ్‌షో సంస్థ కాకుండా.. మైత్రీ మూవీ మేకర్స్ , టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అసలు మొదటి భాగం తీసిన నిర్మాత నిరంజన్ రెడ్డిని కాదని ప్రశాంత్ వర్మ వేరే బ్యానర్లో జై హనుమాన్ ఎందుకు మొదలుపెట్టారు? అన్న ప్రశ్నకు సమాధానం గత కొంతకాలంగా వివాదంగానే ఉంది. హను-మాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి , దర్శకుడు ప్రశాంత్ వర్మ మధ్య ఆర్థిక లావాదేవీలు, గతంలో కుదిరిన ఒప్పందాల విషయంలో తీవ్ర వివాదం తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారం ఏకంగా ఫిల్మ్ ఛాంబర్ వరకు వెళ్లి, అక్కడ ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. అయితే, తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ ప్రశాంత్ వర్మ అప్పట్లో పూర్తిగా ఖండించారు. సరిగ్గా ఈ వివాదం నేపథ్యంలోనే ఇప్పుడు ప్రైమ్‌షో సంస్థ నేరుగా హనుమాన్ 2 టైటిల్‌తో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించడం ఇండస్ట్రీలో పెను సంచలనంగా మారింది.ఇప్పుడు తెలుగు, పాన్-ఇండియా సినీ అభిమానుల ముందు రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకవైపు ప్రైమ్‌షో ప్రకటించిన వైష్ణవ్ తేజ్, వీఐ ఆనంద్‌ల హనుమాన్ 2 – ది రైజ్ ఆఫ్ వానరాస్.. మరోవైపు ప్రశాంత్ వర్మ, రిషబ్ శెట్టిల జై హనుమాన్. ఈ రెండు సినిమాల ప్రకటనతో ప్రేక్షకుల్లో సహజంగానే అనేక సందేహాలు, ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. ఈ రెండు సినిమాలు మొదటి భాగమైన హను-మాన్ కథా ప్రపంచానికి చెందినవేనా? లేక ఒకే పేరు, పౌరాణిక నేపథ్యం ఉన్నా.. ఈ రెండూ పూర్తిగా వేర్వేరు కథలతో, వేర్వేరు కోణాల్లో రూపొందుతున్నాయా? అన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.



