తల్లిదండ్రులైన సమంత-రాజ్ నిడిమోరు.. కొడుకుకు 'దేవ్' అని పేరు!

నటి సమంత-రాజ్ నిడిమోరు తల్లిదండ్రులయ్యారు. ఆమె ఇటీవల ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్తను ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇక తమ కుమారుడికి దేవ్ నిడమోరు అని పేరు పెట్టినట్లు సమంత ప్రకటించింది. చిన్నారి రాకతో తమ జీవితంలో ఒక కొత్త వెలుగు, అనంతమైన ఆనందం నిండిందన్న భావనతో సమంత షేర్ చేసిన ఈ గుడ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె అభిమానులను కూడా ఆనందంలో ముంచెత్తింది. ఆ పోస్ట్ బయటకు వచ్చిన కేవలం నిమిషాల్లోనే లక్షలాది లైకులు, వేలాది కామెంట్లతో సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతోంది. సమంత తన జీవితంలో వ్యక్తిగతంగానూ, ఆరోగ్యపరంగానూ ఎన్నో కఠినమైన సవాళ్లను ఎదుర్కొంది. ఎన్ని కష్టాలు ఎదురైనా ఏమాత్రం కుంగిపోకుండా, ఎంతో ధైర్యంగా నిలబడి పోరాడిన సామ్ జీవితంలో ఇప్పుడు ఇలాంటి ఒక అత్యంత మధురమైన ఘట్టం చోటుచేసుకోవడం పట్ల అభిమానులు ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. ఇన్నాళ్లకు సామ్ జీవితంలో నిజమైన సంతోషం నిండింది,కొడుకు రాకతో సమంత-రాజ్ దంపతుల జీవితంలో మరింత ఆనందం ఉండాలని కోరుకుంటూ అభిమానులు సోషల్ మీడియాలో తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సమంత, రాజ్ నిడిమోరు ఇద్దరూ భారతీయ చిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న వ్యక్తులు. ఒకవైపు రాజ్ అండ్ డీకే దర్శక ద్వయంలో ఒకరిగా, పాన్ ఇండియా స్థాయిలో అత్యుత్తమ వెబ్ సిరీస్‌లు, సినిమాలతో భారీ గుర్తింపు తెచ్చుకోగా..మరోవైపు తన అద్భుతమైన నటనతో, విభిన్న పాత్రలతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు స్టార్ హీరోయిన్ సమంత. వృత్తిపరంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన ఈ జంట, ఇప్పుడు నిజ జీవితంలో తల్లిదండ్రులుగా సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించడంతో యావత్ చిత్ర పరిశ్రమ కూడా హర్షం వ్యక్తం చేస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన పలువురు అగ్ర నటీనటులు, దర్శకులు, నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా సమంత-రాజ్ నిడిమోరు దంపతులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.



