తిలకం పెడితే తప్పేంటి..? లండన్ కోర్టులో హిందూ బాలుడి తండ్రి న్యాయపోరాటం!

PICTURE:imaginary pic generated by AI
బ్రిటన్లో ఇప్పుడు హిందూ మత విశ్వాసాలకు సంబంధించిన ఒక అంశం తీవ్ర చర్చనీయాంశంగా, వివాదాస్పదంగా మారింది. పాఠశాలకు వెళ్లే తొమ్మిదేళ్ల బాలుడు నుదుటిపై తిలకం ధరించకూడదని యాజమాన్యం ఆదేశించడం ఇప్పుడు ఏకంగా లండన్ హైకోర్టు గడప తొక్కింది. తమ కుమారుడిపై పాఠశాల యాజమాన్యం మతపరమైన వివక్ష, వేధింపులకు పాల్పడిందని ఆరోపిస్తూ ఓ భారత సంతతి హిందూ కుటుంబం న్యాయపోరాటానికి దిగింది. తొమ్మిదేళ్ల బాలుడి తండ్రి తన కుమారుడి తరపున లండన్ హైకోర్టును ఆశ్రయించి, పాఠశాల నుంచి 25 వేల పౌండ్లు.. అంటే మన కరెన్సీలో సుమారు 30 లక్షలు పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు .
ఈ వివాదం బ్రిటన్లోని ఆల్పర్టన్ ప్రాంతంలో ఉన్న వికర్స్ గ్రీన్ ప్రైమరీ స్కూల్లో చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల ఆ భారత సంతతి బాలుడు స్వామినారాయణ హిందూ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నాడు. ఆ సాంప్రదాయం ప్రకారం, ఆ బాలుడు గత నాలుగేళ్లుగా నుదుటిపై తిలకం ధరించే క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్తున్నాడు. నాలుగేళ్ల పాటు ఎవరికీ ఎలాంటి అభ్యంతరం కలగలేదు. కానీ, 2025 నవంబరులో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పాఠశాల సిబ్బంది ఆ బాలుడిని నుదుటిపై ఉన్న తిలకం గురించి ప్రశ్నించారు. ఇకపై పాఠశాలలో తిలకం ధరించడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. 2025 డిసెంబర్ 12న ఆ బాలుడిని పాఠశాల కౌన్సిల్ నుంచి కూడా తొలగించారు. ఈ పరిణామంతో ఆవేదన చెందిన బాలుడి తల్లిదండ్రులు వెంటనే పాఠశాల యాజమాన్యానికి లేఖ రాశారు. తమ కుమారుడు ఎన్నో ఏళ్లుగా తిలకం ధరించే పాఠశాలకు వస్తున్నాడని, ఇప్పటివరకు దానిపై ఎలాంటి నిషేధమూ లేదని వారు తమ లేఖలో స్పష్టంగా వివరించారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో, ఇక న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు.
పాఠశాల తీరుపై ఆ బాలుడి తండ్రి తన కుమారుడి తరఫున నేరుగా లండన్ హైకోర్టులో కేసు వేశారు. బ్రిటన్లోని హిందూ సంస్థ అయిన యాక్షన్ ఫర్ హార్మనీ ఈ న్యాయపోరాటానికి పూర్తిస్థాయి ఆర్థిక సహాయం అందిస్తోంది. కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో బాలుడి తండ్రి అత్యంత కీలకమైన మానవ హక్కుల అంశాలను లేవనెత్తారు. పాఠశాల యాజమాన్యం తమ కుమారుడి మత స్వేచ్ఛకు భంగం కలిగించిందని, మతపరమైన వేధింపులకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా మూడు ప్రధాన ఉల్లంఘనలను ఆయన ప్రస్తావించారు. బ్రిటన్ మానవ హక్కుల ఒప్పందంలోని 9వ అధికరణం ప్రకారం ఇది ప్రతి వ్యక్తికి ఉన్న మత స్వేచ్ఛను కాపాడుతుంది. 14వ అధికరణం, వివక్షకు వ్యతిరేక హక్కును కల్పిస్తుంది.సమానత్వ బాధ్యతలు, ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తించే సమానత్వ బాధ్యతలను కూడా పాఠశాల యాజమాన్యం ఉల్లంఘించిందని తండ్రి ఆరోపించారు. ఈ ఉల్లంఘనలకు, తమ కుమారుడు ఎదుర్కొన్న వివక్షకు బాధ్యత వహిస్తూ పాఠశాల యాజమాన్యం 30 లక్షలు పరిహారంగా చెల్లించాలని తండ్రి తన దావాలో డిమాండ్ చేశారు. మరోవైపు, బాలుడి తండ్రి చేసిన ఈ ఆరోపణలన్నింటినీ వికర్స్ గ్రీన్ ప్రైమరీ స్కూల్ యాజమాన్యం పూర్తిగా ఖండించింది. తమ చర్యలో ఎలాంటి మతపరమైన వివక్ష లేదని పాఠశాల తరఫున వాదిస్తున్నారు. బాలుడి నుదుటిపై తిలకం ధరించడాన్ని నిషేధించడం వల్ల అతడు హిందూ మతాన్ని ఆచరించకుండా అడ్డుకున్నట్లు కాదని పాఠశాల వాదించింది. ఒక విద్యార్థి మతపరమైన చిహ్నాన్ని ధరించడానికి అనుమతిస్తే, పాఠశాలలోని ఇతర విద్యార్థులతో సామరస్యం దెబ్బతినే అవకాశం ఉందని యాజమాన్యం పేర్కొంది. అయితే, నాలుగేళ్లుగా తిలకం ధరించి వస్తున్నప్పుడు దెబ్బతినని సామరస్యం ఇప్పుడు ఎందుకు దెబ్బతింటుంది అన్న ప్రశ్న ప్రవాస భారతీయుల్లో, హిందూ సంస్థల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.



