ధాన్యం పక్కదారి పట్టిస్తే వడ్డీతో సహా రికవరీ.. రైస్ మిల్లర్లకు కొత్త రూల్స్..!

రైతుల నుండి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి కస్టమ్ మిల్డ్ రైస్ రూపంలో అప్పగించాల్సిన కొందరు రైస్ మిల్లర్లు.. ఏళ్లుగా కోట్లాది రూపాయల ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తూ వస్తున్నారు. అయితే ఇకపై అలాంటి అక్రమాలకు చెక్ పెట్టే విధంగా ప్రభుత్వం అత్యంత కఠినమైన కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ధాన్యం నిల్వలు తగ్గినా, పక్కదారి పట్టించినా, గడువులోగా సీఎంఆర్ అప్పగించడంలో విఫలమైనా.. భారీ జరిమానా, వడ్డీతో పాటు చట్టపరమైన చర్యలు, ఏకంగా మూడేళ్ల పాటు బ్లాక్ లిస్ట్ చేసేలా కొత్త అగ్రిమెంట్లో నిబంధనలు పొందుపరిచింది. మిల్లులకు కేటాయించిన ధాన్యం, గన్నీ బ్యాగులు, ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అన్నీ ప్రభుత్వ ఆస్తులుగానే పరిగణిస్తారు. సీఎంఆర్ డెలివరీ పూర్తయ్యే వరకు ఈ అగ్రిమెంట్ అమలులో ఉంటుంది. మిల్లర్లకు ధాన్యం కేటాయించేందుకు ప్రభుత్వం ఆర్థిక భద్రతను తప్పనిసరి చేసింది. ఇందులో మిల్లర్ల గత చరిత్రను బట్టి వేర్వేరు నిబంధనలు విధించారు. గతంలో బకాయిలు, డిఫాల్ట్ చరిత్ర లేని మిల్లర్లు తమకు కేటాయించిన ధాన్యం విలువపై 10 శాతం బ్యాంక్ గ్యారంటీ , 25 శాతం సెక్యూరిటీ డిపాజిట్ సమర్పించాలి. గతంలో డిఫాల్ట్ అయి, ఆ తర్వాత బకాయిలు, జరిమానా పూర్తిగా చెల్లించిన మిల్లర్లు 20 శాతం బ్యాంక్ గ్యారంటీ లేదా 25 శాతం సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వాలి. బకాయిలు చెల్లించినా 25 శాతం జరిమానా పెండింగ్‌లో ఉన్నవారికి అదనపు భద్రత కల్పించాలి. ప్రస్తుత డిఫాల్టర్లకు మాత్రం కొత్తగా ఒక్క గింజ ధాన్యం కూడా కేటాయించరు. మిల్లింగ్ సామర్థ్యం ప్రకారం కేటాయించే ధాన్యం విలువకు సరిపడా చెక్కులు ఇవ్వడంతో పాటు, ఆర్థికంగా బలంగా ఉండి, గతంలో డిఫాల్ట్ కాని మరో ఇద్దరు మిల్లర్లు ష్యూరిటీ ఇవ్వాలి. లీజు మిల్లుల విషయంలో నిబంధనలు మరింత కఠినంగా ఉన్నాయి. ధాన్యం కేటాయింపు విలువలో ఏకంగా 50 శాతానికి ఈ-బ్యాంక్ గ్యారంటీ సమర్పించాలి. యజమాని నుంచి నో డ్యూ సర్టిఫికెట్, లీజు ఒప్పంద పత్రాలతో పాటు ఇతర హామీలు ఇవ్వాలి. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తూకం వేసే సమయంలో మిల్లర్లు తమ ప్రతినిధిని కచ్చితంగా ఉంచాలి. ధాన్యం రకం, నాణ్యత, పరిమాణాన్ని అక్కడే పరిశీలించి అంగీకరించాలి. ఒకవేళ ప్రతినిధి లేకపోయినా, ఆన్లైన్ లేదా రికార్డుల్లో నమోదైన ధాన్యాన్ని మిల్లర్లు స్వీకరించినట్టుగానే పరిగణిస్తారు. ఆ తర్వాత నాణ్యత, తూకం, రకం విషయంలో అభ్యంతరాలు చెప్పేందుకు ఎలాంటి అవకాశం ఉండదు. ధాన్యం స్వీకరించిన 3 రోజుల్లో మొత్తం వివరాలను అధికారులకు తెలియజేయాలి. ఇక నాణ్యత విషయంలో ప్రభుత్వం పెద్ద మార్పులు తెచ్చింది. ప్రభుత్వం కేటాయించిన 7 సన్న రకాల ధాన్యాన్ని వేరుగా నిల్వ చేసి, వాటి నుంచే సన్నబియ్యం తయారు చేయాలి. బియ్యం బస్తాలపై బియ్యం రకం పేరును స్పష్టంగా ముద్రించాలి. బాయిల్డ్ సీఎంఆర్‌లో 5 శాతం బ్రోకెన్, రా సీఎంఆర్‌లో 10 శాతం బ్రోకెన్‌తో కూడిన ఇంప్రూవ్డ్ రైస్ సరఫరా చేయాలి. దీనికోసం 2026–27 సీజన్ ప్రారంభానికి ముందే మిల్లింగ్ యంత్రాలను అప్‌గ్రేడ్ చేసుకోవాలి. 2027–28 నుంచి 100 శాతం ఇంప్రూవ్డ్ రైస్ సప్లై చేయాలని ఒప్పందంలో స్పష్టం చేశారు. మిగిలిన బ్రోకెన్ బియ్యాన్ని విడిగా నిల్వ చేసి, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వేలం ద్వారా విక్రయించాలి. ఆ బ్రోకెన్ బియ్యాన్ని కూడా అప్పగించిన తర్వాతే సీఎంఆర్ సరఫరా పూర్తయినట్లు పరిగణిస్తారు. సాధారణ బియ్యంలో ప్రతీ 100 కిలోలకు ఒక కిలో చొప్పున ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ కలపాలి.
గడువులోగా సీఎంఆర్ అందించకపోతే మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవు. మిల్లులో ధాన్యం నిల్వలు అందుబాటులో ఉంటే కలెక్టర్ల ఆధ్వర్యంలో సివిల్ సప్లయ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకొని వేలం వేసి, ఆ మొత్తాన్ని బకాయిల కింద జమ చేస్తారు. ఒకవేళ ధాన్యం నిల్వలు లేకపోతే, ప్రభుత్వానికి రావాల్సిన ధాన్యం విలువను రికవరీ ఖర్చులతో పాటు వసూలు చేస్తారు. దీనికి అదనంగా 25 శాతం జరిమానా, 12 శాతం వార్షిక వడ్డీ విధిస్తారు. ప్రభుత్వ ధాన్యాన్ని ప్రైవేట్ ధాన్యంతో కానీ, మరో సీజన్‌కు చెందిన ధాన్యంతో కానీ కలపకూడదు. ముఖ్యంగా పీడీఎస్ బియ్యాన్ని సీఎంఆర్ కింద రీసైక్లింగ్ చేసి సరఫరా చేయడానికి వీల్లేదు. సివిల్ సప్లయ్స్, జిల్లా యంత్రాంగం, ఎఫ్‌సీఐ అధికారులు ఎప్పుడైనా మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించవచ్చు. మిల్లర్లు ప్రతీ సోమవారం ధాన్యం స్వీకరణ, మిల్లింగ్, బియ్యం డెలివరీ వివరాలను అధికారులకు అందించడంతో పాటు, ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో నమోదు చేయాలి. నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తే ఒప్పందాన్ని రద్దు చేసి, మిల్లింగ్ చార్జీలు, బకాయిలు నిలిపివేస్తారు. షోకాజ్ నోటీసు ఇచ్చి, కనీసం 10 రోజుల గడువు తర్వాత గరిష్టంగా మూడేళ్ల వరకు బ్లాక్ లిస్ట్ చేసే అవకాశం ఉంది. మొత్తం ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ సరఫరా పూర్తయి, గన్నీ బ్యాగులు, ధాన్యం, ఎఫ్ఆర్కే లెక్కలు సరిపోల్చిన తర్వాతే మిల్లర్లకు బిల్లులు విడుదల చేస్తారు. ఈ కఠిన నిబంధనల వల్ల అక్రమాలకు పాల్పడే మిల్లర్లకు చెక్ పడటంతో పాటు, నిజాయితీగా పనిచేసే మిల్లర్లకు, ప్రభుత్వానికి, అంతిమంగా పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందే అవకాశం ఏర్పడుతుంది.



