ఒకప్పటి దావూద్ అడ్డాపై బుల్డోజర్..చరిత్రలోకి 87 ఏళ్ల నాటి చీకటి సామ్రాజ్యం..?

ఒకప్పుడు ముంబై అండర్‌వరల్డ్‌ను తన కనుసైగలతో శాసించిన గ్లోబల్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం. ఆ పేరు వింటేనే ఇప్పటికీ ముంబైలో ఒకప్పటి చీకటి రోజులు గుర్తుకొస్తాయి. అయితే, దావూద్ గ్యాంగ్‌కు, అతని కుటుంబానికి పుట్టినిల్లులాంటి ఒక చారిత్రక భవనం ఇప్పుడు చరిత్రలో కలిసిపోబోతోంది. ముంబైలోని 87 ఏళ్ల నాటి హాజీ ఇస్మాయిల్ హాజీ హబీబ్ ముసాఫిర్ ఖానా భవనాన్ని కూల్చివేయడానికి బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బుల్డోజర్లు రంగంలోకి దిగాయి . ఈ భవనానికి దాదాపు 87 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. 1939లో హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు తాత్కాలిక వసతి కల్పించే ఉద్దేశంతో హాజీ ఇస్మాయిల్ హాజీ హబీబ్ ముసాఫిర్ఖానా ను నిర్మించారు. గ్రౌండ్-ప్లస్-వన్ అంతస్తులతో, 36 గదులతో ఉన్న ఈ భవనం ఒకప్పుడు యాత్రికులతో కళకళలాడేది. కానీ, 1970–80 దశకాల్లో ఈ భవనం రూపురేఖలే కాదు, దాని చరిత్రే మారిపోయింది. 1970ల ప్రారంభంలో ముంబై పోలీస్ కానిస్టేబుల్ ఇబ్రహీం కస్కర్ తన కుటుంబంతో కలిసి ఇక్కడికి మకాం మార్చారు. ఆయన కొడుకు దావూద్ ఇబ్రహీం ఇక్కడే పెరిగి, నెమ్మదిగా ముంబై అండర్‌వరల్డ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ భవనంలోని రెండో అంతస్తును పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్న దావూద్, అక్కడే తన అండర్‌వరల్డ్ కార్యాలయాన్ని నిర్వహించేవాడు.
కేవలం నివాసం మాత్రమే కాదు.. విదేశాల నుంచి సముద్ర మార్గం ద్వారా అక్రమంగా తెచ్చే బంగారం, ఎలక్ట్రానిక్స్ వంటి స్మగ్లింగ్ వస్తువులను ఇక్కడే రహస్యంగా దాచేవారని అప్పటి రికార్డులు చెబుతున్నాయి. అంతేకాదు, భారతదేశాన్ని కుదిపేసిన 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కుట్రకు సంబంధించిన కీలక చర్చలు కూడా ఇదే భవనంలో జరిగినట్టు దర్యాప్తు సంస్థల రికార్డుల్లో నమోదై ఉంది. అయితే ప్రస్తుతం ఈ బిల్డింగ్‌పై దావూద్ కుటుంబానికి ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు లేవు. 2015లోనే చారిటీ కమిషనర్ అధికారిక అనుమతితో ఈ ఆస్తిని సైఫీ బుర్హానీ అప్లిఫ్ట్మెంట్ ట్రస్ట్ కోటి 10 లక్షలకు చట్టబద్ధంగా కొనుగోలు చేసింది. భెండీ బజార్ ప్రాంతాన్ని ఆధునీకరించే భారీ క్లస్టర్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ భవనాన్ని ట్రస్ట్ తీసుకుంది. కాలక్రమేణా 87 ఏళ్ల నాటి ఈ భవనం అత్యంత శిథిలావస్థకు చేరి, ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదకర స్థితికి చేరుకుంది. దీంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ దీనిని అత్యంత ప్రమాదకరమైన సీ-1 కేటగిరీ కట్టడంగా గుర్తించింది. ఇదే అంశంపై 2020లోనే బాంబే హైకోర్టు కూడా ఈ భవనాన్ని కూల్చివేసేందుకు స్పష్టమైన అనుమతి ఇచ్చింది. సెకండ్ కూపర్ స్ట్రీట్ రోడ్డు విస్తరణకు, కొత్తగా నిర్మిస్తున్న ఇంటర్నల్ రోడ్డుకు ఈ భవనం అడ్డుగా ఉంది. ఈ క్రమంలోనే ఒకప్పుడు దావూద్ నివసించిన, తన ఆఫీసు నడిపిన గదులను అధికారులు ఇప్పటికే తొలగించారు.



