మరోసారి ధురంధర్ హిట్ కాంబో?

ధురంధర్ 1 మరియు ధురంధర్ 2 సినిమాలతో భారతీయ బాక్సాఫీస్ ను షేక్ చేసిన హీరో రణ్వీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ లో కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతోందనే వార్త ఫ్యాన్స్ లో జోష్ నింపింది. ఈ రెండు సినిమాలతో ఏకంగా మూడు వేల కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టిన ఈ కాంబినేషన్ గురించి ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. రణ్వీర్ సింగ్ ప్రస్తుతం ప్రళయ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. మరోవైపు డైరెక్టర్ ఆదిత్య ధర్ మాత్రం తన తదుపరి సినిమాపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై రకరకాల ఊహాగానాలు చెక్కర్లు కొట్టాయి. గతంలో విక్కీ కౌశల్‌తో ప్రకటించిన ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ కథను ఆదిత్య ధర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు వినిపించాడని గట్టిగా ప్రచారం జరిగింది. ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లకపోవడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్‌లకు కూడా కొత్త కథలు వినిపించినట్లు వార్తలు వచ్చాయి. చివరకు మళ్లీ విక్కీ కౌశల్‌తోనే అశ్వత్థామను పట్టాలెక్కిస్తాడంటూ గాసిప్స్ వినిపించాయి. అయితే వీటిలో ఏ ఒక్క దానిపైనా ఆదిత్య ధర్ ఇప్పటివరకు స్పందించలేదు.
టాలీవుడ్ హీరోతో ఆదిత్య ధర్ సినిమా చేస్తాడని అందరూ అనుకుంటున్న తరుణంలో.. తాజాగా మళ్లీ రణ్వీర్ సింగ్ పేరు బలంగా తెరపైకి వచ్చింది. ధురంధర్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోందని బాలీవుడ్ వర్గాల్లో జోరుగా బజ్ నడుస్తోంది. అశ్వత్థామ, ఆర్య వర్త్ వంటి కథలను పక్కన పెట్టి తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భావిస్తున్న మహా సామ్రాట్ చంద్రగుప్త మౌర్య జీవిత కథను వెండితెరపైకి తీసుకురావాలని ఆదిత్య ధర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ భారీ హిస్టారికల్ మూవీ స్క్రిప్ట్ పనుల్లో ఆయన బిజీగా ఉన్నారట. 2027లో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించి.. 2028 చివర్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆదిత్య ధర్ టార్గెట్ పెట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.



