1500 డిగ్రీల వేడిని తట్టుకునే కార్బనైజ్డ్ రేయాన్ ఫ్యాబ్రిక్ వస్త్రం.. ఆ మిస్సైల్స్ తయారీకి ఇదే కీలకం!

ప్రపంచంలోనే అత్యంత భారీ రక్షణ బడ్జెట్ ఉన్న అమెరికాకు ఒకే ఒక్క ప్రత్యేకమైన వస్త్రం కొరత ఉండడం చర్చనీయంశంగా మారింది. అది ఇప్పుడు అమెరికా యుద్ధ వ్యూహాలను ప్రభావితం చేస్తోంది. ఏ యుద్ధంలోనైనా దాడి చేయడం ఎంత ముఖ్యమో, శత్రువు చేసే ప్రతిదాడి నుంచి తమ సైనిక స్థావరాలను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. తాజా కథనాల ప్రకారం.. ఇరాన్ ప్రయోగించే డ్రోన్లు, క్షిపణులను అడ్డుకునే శక్తి క్రమంగా తగ్గిపోతుండటంతో, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలకు కోలుకోలేని నష్టం వాటిల్లుతోందనే ఆందోళన పెంటగాన్ వర్గాల్లో నెలకొంది. ఈ ముప్పును అడ్డుకోవడానికి అమెరికా ప్రధానంగా నమ్ముకున్న ఆయుధం పేట్రియాట్ ప్యాక్-3 మిస్సైల్ సిస్టమ్. అయితే, ఈ క్షిపణుల నిల్వలు వేగంగా తరిగిపోతుండటంతో వాటి ఉత్పత్తిని యుద్ధ ప్రాతిపదికన పెంచాలని అమెరికా ప్రయత్నించింది. కానీ ఇక్కడే ఒక ఊహించని ఇబ్బడిని ఎదురైంది. అదే కార్బనైజ్డ్ రేయాన్ ఫ్యాబ్రిక్.
ఈ కార్బనైజ్డ్ రేయాన్ ఫ్యాబ్రిక్ ను రేకార్బ్ సీ2బీ అంటారు. పేట్రియాట్ క్షిపణులను ప్రయోగించినప్పుడు, వాటి రాకెట్ మోటార్ నాజిల్స్ విపరీతమైన వేడికి గురవుతాయి. ఆ వేడికి లోహాలు సైతం కరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ పరిస్థితుల్లో నాజిల్స్ కరిగిపోకుండా, రాకెట్ పరికరాలను కాపాడటానికి ఈ ప్రత్యేక వస్త్రాన్ని హీట్ రెసిస్టెంట్ మెటీరియల్‌గా మారుస్తారు. అధిక వేడి తగిలినప్పుడు ఇది కరిగి రాకెట్ భాగంపై ఒక రక్షణ పొరలా ఏర్పడి, క్షిపణి తన లక్ష్యాన్ని చేరేలా కాపాడుతుంది. ఈ ఒక్క వస్త్రం లేకుండా పేట్రియాట్ క్షిపణిని తయారు చేయడం అసాధ్యం.అగ్రరాజ్యం అమెరికాకు చెందిన అత్యంత కీలకమైన మిస్సైల్ కోసం, ఈ వస్త్రం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు దాటి రావాల్సి ఉంటుంది. ఆ సప్లై చైన్ ఎంతో క్లిష్టంగా ఉంటుంది.
దీని తయారీ ప్రక్రియ చాలా ప్రత్యేకం. మొదటి దశలో ఒక ప్రత్యేక రకం చెట్ల కలప నుంచి గుజ్జును తీసి, దానికి కొన్ని రసాయనాలు కలిపి అత్యంత సన్నటి, బలమైన రేయాన్ దారాలను ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియ ఒక థాయ్‌లాండ్ కంపెనీకి చెందిన చెక్ రిపబ్లిక్ ఫ్యాక్టరీలో జరుగుతుంది. అక్కడి నుంచి ఈ దారాలు ఫ్రాన్స్‌లోని ప్రముఖ ఏరోస్పేస్ సంస్థ ఏరియన్ గ్రూప్ కు చేరుతాయి. అక్కడ వాటిని ఒక వస్త్రంలా నేసి, ప్రత్యేకమైన కొలిమిలో దాదాపు 1,500 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు. ఆ భయంకరమైన వేడికి వస్త్రంలోని ఇతర ఎలిమెంట్స్ అన్నీ ఆవిరైపోయి, కేవలం స్వచ్ఛమైన కార్బన్ మాత్రమే మిగులుతుంది. దీనినే రేకార్బ్ సీ2బీ అంటారు. పేట్రియాట్ రాకెట్ మోటార్ల కఠినమైన నాణ్యతా ప్రమాణాలను అందుకోగలిగింది కేవలం ఫ్రాన్స్‌కు చెందిన ఏరియన్ గ్రూప్ తయారు చేసే ఈ మెటీరియల్ మాత్రమే కావడం విశేషం.
ఫ్రాన్స్‌లో 1,500 డిగ్రీల కొలిమిలో పురుడుపోసుకున్న ఈ కార్బనైజ్డ్ రేయాన్ ఫ్యాబ్రిక్ ప్రయాణం అక్కడితో ముగియదు. ఏరియన్ గ్రూప్ ఈ వస్త్రాన్ని అమెరికాలోని పార్క్ ఏరోస్పేస్ అనే సంస్థకు సరఫరా చేస్తుంది. ఈ అమెరికన్ సంస్థ ఆ వస్త్రానికి ఒక ప్రత్యేకమైన రెసిన్ పూత పూసి, దానిని రాకెట్ మోటార్లలో వాడేందుకు అనువైన హీట్-రెసిస్టెంట్ మెటీరియల్‌గా సిద్ధం చేస్తుంది. ఈ దశ పూర్తయిన తర్వాతే, ఆ మెటీరియల్ అమెరికా ప్రముఖ డిఫెన్స్ కాంట్రాక్టర్ అయిన ఎల్ 3 హారిస్ సంస్థకు చేరుకుంటుంది. అక్కడ రాకెట్ మోటార్ల తయారీలో దీనిని అమరుస్తారు. అంటే చెక్ రిపబ్లిక్లో దారంగా మొదలై, ఫ్రాన్స్‌లో కార్బన్ వస్త్రంగా మారి, అమెరికాలో రెసిన్ పూత వేయించుకుని, చివరకు పేట్రియాట్ క్షిపణిలో భాగమవుతుంది. ఇంత సుదీర్ఘమైన అంతర్జాతీయ సరఫరా గొలుసులో ఎక్కడ చిన్న అంతరాయం కలిగినా, మొత్తం క్షిపణి తయారీ ప్రక్రియ స్తంభించిపోతుంది. మరి ఈ వస్త్రాన్ని ఎక్కువ మొత్తంలో తయారు చేసి, వేగంగా మిస్సైళ్లు ఎందుకు నిర్మించలేకపోతున్నారు? అనే ప్రశ్నకు పార్క్ ఏరోస్పేస్ సీఈవో బ్రియాన్ షోర్ కీలక సమాధానాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం అమెరికా రక్షణ అవసరాల డిమాండ్‌ను అందుకునే స్థాయిలో ఈ రేయాన్ ఫ్యాబ్రిక్ అందుబాటులో లేదు. అంతేకాదు, ఫ్రాన్స్ నుంచి ఈ వస్త్రం పార్క్ ఏరోస్పేస్‌కు చేరిన వెంటనే దాన్ని క్షిపణుల్లో వాడేయడం కుదరదు. అది వినియోగానికి సిద్ధం కావాలంటే అత్యంత కఠినమైన నాణ్యతా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పరీక్షల ప్రక్రియ దాదాపు రెండేళ్ల పాటు కొనసాగుతుందని బ్రియాన్ షోర్ స్పష్టం చేశారు.ఆధునిక యుద్ధాలు కేవలం సైనికుల సంఖ్యతోనో, భారీ బడ్జెట్లతోనో మాత్రమే నిర్ణయించబడవని ఈ పరిణామం మరోసారి నిరూపించింది.



