పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్..బర్డ్ ఫ్లూ మహమ్మారికి తొలి స్వదేశీ టీకా..!

మన దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం పౌల్ట్రీ . కోళ్ల పెంపకం లక్షలాది కుటుంబాలకు జీవనాధారం. అయితే బర్డ్ ఫ్లూ ఈ రంగాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో ఒకటి. ఎక్కడో ఒక ఫారంలో ఒక కోడికి బర్డ్ ఫ్లూ వైరస్ సోకిందని తెలిస్తే చాలు ఆ చుట్టుపక్కల ఉన్న ఫారాల్లోని లక్షలాది కోళ్లను ప్రాణాలతోనే పూడ్చిపెట్టాల్సిన దారుణమైన పరిస్థితి. దీనివల్ల రైతులకు రాత్రికి రాత్రే భారీ నష్టం వస్తుంది. అయితే ఇన్నాళ్లూ ఈ బర్డ్ ఫ్లూ మహమ్మారికి సరైన మందు లేదు, వ్యాక్సిన్ లేదు. కానీ ఇప్పుడు భారత్ మరో చారిత్రక శాస్త్రీయ విజయాన్ని సాధించింది. దేశంలో కోళ్ల పెంపకందారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ఈ H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ కు మన దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ వ్యాక్సిన్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అత్యంత ప్రమాదకరమైన బర్డ్ ఫ్లూ వైరస్‌ను నియంత్రించడమే లక్ష్యంగా భారతీయ సైంటిస్టులు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ఫైనల్ గా భోపాల్‌లోని భారత వ్యవసాయ పరిశోధనా మండలి పరిధిలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ శాస్త్రవేత్తలు మొట్టమొదటి స్వదేశీ టీకాను రూపొందించారు. ఇది H5N1 వైరస్‌కు చెందిన అత్యంత ప్రమాదకరమైన క్లేడ్ 2.3.2.1a రకానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇదొక ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ . ప్రస్తుతం మన దేశంలో వ్యాప్తి చెందుతున్న వైరస్ రకాన్ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని, మన వాతావరణానికి సరిపోయే విధంగా మన శాస్త్రవేత్తలు దీనిని రూపొందించారు. విదేశాల నుంచి వచ్చే వాణిజ్య వ్యాక్సిన్లు మన దేశంలో అందుబాటులో లేకపోవడంతో ఈ స్వదేశీ వ్యాక్సిన్ అభివృద్ధి పౌల్ట్రీ రంగానికి చాలా కీలకమైనది. ఈ అద్భుతమైన వ్యాక్సిన్‌ను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నవంబర్ 20న అధికారికంగా దేశానికి అంకితం చేయనున్నారు.



