మార్కెట్లో పత్తికి రికార్డు ధర…క్వింటాల్ ధర రూ.9,200..ఎక్కడో తెలుసా..?
కామెంట్లు (0)

తెల్ల బంగారంగా పిలుచుకునే పత్తి రైతుల పరిస్థితి ఎప్పుడూ ఊగిసలాటగానే ఉంటుంది. కానీ, ఈసారి పరిస్థితులు మారాయి. పత్తి రైతులకు సీజన్ ప్రారంభంలోనే ఒక అద్భుతమైన శుభవార్త అందింది. ఆరుగాలం కష్టపడి పండించిన పత్తికి కళ్లు చెదిరే ధర పలుకుతోంది. క్వింటాల్ పత్తి ఏకంగా 9,200 పలికి రికార్డ్ సృష్టించింది. అసలు పత్తికి ఇంత రేటు రావడానికి కారణం ఏంటి? ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధర కంటే ఎక్కువకు ఎందుకు పత్తిని కొనుగోలు చేస్తున్నారు.
తెలంగాణలో పత్తి కొనుగోళ్లకు కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మార్కెట్ చాలా ఫేమస్. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా రైతులు తమ పత్తిని ఇక్కడికే తీసుకొస్తుంటారు. సాధారణంగా సీజన్ మొదట్లో ధర కాస్త తక్కువగా ఉండి, మెల్లగా పెరుగుతుంది. కానీ ఈ ఏడాది సీన్ రివర్స్ అయింది. సెప్టెంబర్ 23 నుంచి జమ్మికుంట మార్కెట్లోకి కొత్త పత్తి రావడం ప్రారంభమైంది. మొదటి రోజుల్లో క్వింటాల్కు 8,600 వరకు ధర పలికిన పత్తి.. ఇప్పుడు కళ్లు చెదిరే స్థాయికి చేరుకుంది. తాజాగా ఈ మార్కెట్లో క్వింటాల్ పత్తి గరిష్ట ధర 9,200 పలికింది. నాణ్యతను బట్టి వ్యాపారులు విభిన్న రకాల ధరలను చెల్లిస్తున్నారు. వివరంగా చూస్తే.. అత్యంత నాణ్యమైన 10 క్వింటాళ్ల పత్తికి 9,200 చెల్లించగా, మరో 100 క్వింటాళ్లకు 8,900 చొప్పున కొనుగోలు చేశారు. అలాగే కొద్దిగా తేమ ఉన్న సుమారు 580 క్వింటాళ్ల పత్తికి 8,000 నుంచి 8,800 వరకు ధర లభించింది. అంటే మార్కెట్కు వచ్చిన పత్తిలో అత్యల్పంగా చూసుకున్నా 8,000 కు తగ్గకుండా ధర పలుకుతుండటంతో రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా పత్తికి సరైన ధర లేక ఇబ్బంది పడ్డ రైతులకు, ఈ ఏడాది ప్రారంభ ధరలే ఇంత భారీగా ఉండటం నిజంగా పెద్ద ఊరట అని చెప్పాలి. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్తికి కనీస మద్దతు ధరను క్వింటాల్కు 8,667 రూపాయలుగా నిర్ణయించింది. సాధారణంగా రైతులు తమ పంటను ప్రైవేట్ వ్యాపారులకు అమ్మితే తక్కువ రేటు వస్తుందని, ప్రభుత్వం ఏర్పాటు చేసే సీసీఐ కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూస్తుంటారు. కానీ జమ్మికుంట మార్కెట్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర 8,667 అయితే.. ప్రైవేట్ వ్యాపారులు అంతకంటే ఎక్కువగా అంటే 9,200 వరకు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాల వైపు చూడకుండా, నేరుగా ప్రైవేటు వ్యాపారులకే తమ పత్తిని విక్రయించడానికి మొగ్గు చూపుతున్నారు.


