ఎల్నినో నేపథ్యంలో రైతులకు ఊరట..ఖరీఫ్ కోసం కేంద్రం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక

మన దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రంగాలలో ఒకటి వ్యవసాయం. అయితే వచ్చే ఏడాది ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా దేశంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉందన్న వాతావరణ అంచనాలు ఇప్పుడు అన్నదాతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టి నష్టాన్ని పూర్తిగా నివారించడంపై కేంద్రం దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగును, కోట్లాది మంది అన్నదాతల ఆదాయాన్ని కాపాడేందుకు ఒక భారీ మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేసింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎల్ నినో ప్రభావంపై ప్రత్యేక పర్యవేక్షణ అత్యంత శాస్త్రీయంగా కొనసాగుతోంది. ఏ జిల్లాకు ఎంత ముప్పు ఉందో అంచనా వేయడానికి అధికారులు కేవలం పాత లెక్కలపైనే ఆధారపడలేదు. ఆయా ప్రాంతాల్లోని వర్షపాత అంచనాలు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిపారుదల వసతులు, మొత్తం సాగు విస్తీర్ణం వంటి సమగ్ర సైంటిఫిక్ డేటాను లోతుగా విశ్లేషించారు. ఆ విశ్లేషణ ఆధారంగానే దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే అధిక ముప్పు ఉన్న 262 జిల్లాలను ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఈ జిల్లాల్లోని క్షేత్రస్థాయి పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం , ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సమన్వయంతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. ఎక్కడైనా వర్షం లోటు కనిపించినా, భూగర్భ జలాలు తగ్గినా తక్షణమే స్పందించి రైతులకు అండగా నిలిచేలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
వర్షాలు ఆలస్యమైనప్పుడు లేదా మొదట వేసిన విత్తనాలు మొలకెత్తక ఎండిపోయినప్పుడు రైతులు మళ్లీ విత్తనాలు దొరక్క ఇబ్బందిపడుతుంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వర్షాలు ఆలస్యమైనా లేదా సాధారణం కంటే తక్కువగా కురిసినా రైతులు ఏమాత్రం ఆందోళన చెందకుండా అదనపు ఖరీఫ్ విత్తనాలను ముందస్తుగానే సిద్ధం చేసి ఉంచాలని నిర్ణయించింది. విత్తనాల నిల్వ మాత్రమే కాకుండా.. జిల్లా స్థాయిలో రూపొందించిన వ్యవసాయ అత్యవసర ప్రణాళికలపై రైతులకు సీజన్ కంటే ముందుగానే పూర్తిస్థాయి అవగాహన కల్పించనుంది. ఆయా జిల్లాల్లోని వర్షపాత పరిస్థితులకు అనుగుణంగా..ఏ పంటలు వేస్తే తక్కువ నీటితో మంచి దిగుబడి వస్తుంది. పంటల ఎంపికలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి. విత్తనాలు వేసే సమయాన్ని ఎలా మార్చుకోవాలి. అనే కీలక అంశాలపై వ్యవసాయ నిపుణులు రైతులకు నేరుగా క్షేత్రస్థాయిలో తగిన సూచనలు అందించనున్నారు. దీనివల్ల తప్పుడు సమయాల్లో విత్తనాలు వేసి రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం భారీగా తగ్గుతుంది.



